
పోలీసులను కలిసిన ప్రేమజంట
ఒంగోలు టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను కుటుంబసభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని పుల్లలచెరువుకు చెందిన ప్రేమజంట పోలీసులను రక్షణ కోరారు. పుల్లలచెరువు గ్రామానికి చెందిన దేశావత్ రూపాబాయి, పవన్ కుమార్‌లు సోమవారం ఎస్పీ కార్యాలయంలో స్పందనలో పోలీసు అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. దేశావత్ రూపాబాయి గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది.
ఆమెకు అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్న వీరిద్దరూ ఈ విషయాన్ని ఇళ్లల్లో పెద్దలకు తెలియజేశారు. ఈపెళ్లికి పవన్ కుటుంబసభ్యులు అంగీకరించగా రూప కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో నాలుగు నెలల క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం ఇంట్లో విషయం చెప్పగా..తల్లిదండ్రులు మేం చూసిన సంబంధమే చేసుకోవాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. గర్భిణి అయిన రూపను నంద్యాలలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా సంతకాలు చేయించి అబార్షన్ చేయించారు. మరో పెళ్లికి ఏర్పాటు చేస్తుండటంతో ఈ నెల 9న పెద్దలకు తెలియకుండా ఇంటి నుంచి వచ్చేశారు. మాకు రక్షణ కల్పించాలని, తన మీద దాడి చేసిన తలిదండ్రులు, మావయ్య, అమ్మమ్మలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment