
మూల్యాంకన ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ: స్పాట్ వాల్యూయేషన్‌లో పాల్గొన్న ఉపాధ్యాయులందరూ మూల్యాంకన ప్రక్రియను పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ తమీమ్‌అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియలో చీఫ్ ఎగ్జామినర్లు 113 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 680 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 226 మంది, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు 9 మంది వెరసి మొత్తం 1,028 మంది నిమగ్నమై ఉన్నారని వివరించారు. వీరు సుమారు 1,78,218 మంది విద్యార్థుల పరీక్ష పేపర్లు దిద్దాల్సి ఉంటుందని తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా తగిన సదుపాయాలు కల్పించాలని డీఈఓ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈఓతోపాటు ఎగ్జామ్స్ ఏసీ శివకుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు.