
డెత్ సర్టిఫికెట్‌కు రూ.90 వేల లంచం
మద్దిపాడు: డెత్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.90 వేల లంచం అడిగిన తహసీల్దారును, వీఆర్వో ను ఏసీబీ డీఎస్పీ వలపన్ని పట్టుకున్న ఘటన మద్దిపాడులో బుధవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఎస్ శిరీష అందించిన వివరాల మేరకు మండలంలోని దొడ్డవరం గ్రామానికి చెందిన వల్లెపు అంకమ్మరావు భార్య చనిపోవడంతో ఆమె డెత్ సర్టిఫికెట్ కోసం ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో సర్టిఫికెట్ ఇచ్చేందుకు అంకమ్మరావును అదే గ్రామానికి వీఆర్వో గా పని చేస్తున్న కొప్పోలు అంకమ్మరావు ద్వారా తహసీల్దార్ సుజన్ కుమార్ రూ.90 వేల లంచం అడిగాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని వల్లెపు అంకమ్మరావు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ శిరీష సూచనలతో బుధవారం ఆ డబ్బులు తహసీల్దార్ కు అంకమ్మరావు ఇవ్వడానికి ప్రయత్నించగా వీఆర్‌ఓకి ఇవ్వాలని చెప్పాడు. దీంతో వీఆర్వోకు ఆ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అన్నంగి గ్రామంలో రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో తహసీల్దార్ అక్కడకు వెళ్లగా అక్కడ మఫ్టీలో ఉన్న మరో టీం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ గురువారం నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, వీఆర్వోలు

డెత్ సర్టిఫికెట్‌కు రూ.90 వేల లంచం