
మెరిట్ కం రోస్టర్ విధానంలో పదోన్నతులివ్వాలి
ఒంగోలు సిటీ: మెరిట్ కం రోస్టర్ విధానంలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని బీటీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కళ్లగుంట మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద గురువారం మధ్యాహ్నం ధర్నా నిర్వహిచంచారు. ధర్నాకు జిల్లా అధ్యక్షుడు దద్దాల శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ మెరిట్ కం రోస్టర్ విధానం రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బహుజన ఉపాధ్యాయ హక్కులను కాల రాస్తోందని, కేవలం ఒక వర్గానికి పదోన్నతులు కల్పించే కుట్ర జరుగుతుందన్నారు. ఈ చర్యను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని, రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేస్తామ న్నారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానం అమలయ్యే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు కేవలం మెరిట్ ఆధారంగా తయారు చేసినవని, ఈ విధానం రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధమన్నారు. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న విధానాన్ని కమిషనర్ నోటి మాటలతో రద్దు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. తక్షణమే జాబితాలు రద్దు చేసి మెరిట్ కం రోస్టర్ విధానంలో జాబితాలు తయారు చేసిన తర్వాతే పదోన్నతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్చూరి మాధవరావు మాట్లాడుతూ బీటీఏ పోరాటాల ద్వారా సాధించుకున్న మెరిట్ కం రోస్టర్ విధానానికి తూట్లు పొడవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమస్యను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని, ఏప్రిల్ 25న కమిషనరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర నాయకులు పారాబత్తెన జాలరామయ్య, కట్టా రమేష్, మద్దిరాల శరత్ చంద్రబాబు, చలంచర్ల పెద్ద బ్రహ్మయ్య, పాలేటి సువర్ణ బాబు, జిల్లా నాయకులు కర్ర దేవా సహాయం, గంటెనపల్లి శ్రీనివాసులు, పల్లె తిరుపతిస్వామి, నూకతోటి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.