
టీడీపీ ఉప సర్పంచ్ దౌర్జన్యం
తాళ్లూరు: అధికార పార్టీ అనే అహంకారంతో టీడీపీకి చెందిన ఓ ఉపసర్పంచ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. శ్మశానానికి దాతలు నిర్మించిన ప్రహరీని కూల్చివేసి తన స్థలంలోకి మట్టి రోడ్డు నిర్మించుకున్నాడు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఆ గ్రామస్తులు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. తాళ్లూరు మండలంలోని శివరాంపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళ్తే.. శివరామపురం గ్రామం నుంచి ఉమ్మనేనిపాలెం వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 70/16లో 1.08 ఎకరాల్లో హిందూ శ్మశానం ఉంది. ఆ శ్మశాన స్థలాన్ని అనుకుని టీడీపీ నాయకుడైన శివరామపురం ఉపసర్పంచ్ నారిపెద్ది రామ్మూర్తికి చెందిన స్థలం ఉంది. శ్మశానాల అభివృద్ధికి పంచాయతీ కేటాయించిన నిధులతో పాటు దాతల సహకారంతో శ్మశానానికి చుట్టూ ప్రహరీ నిర్మించారు. అయితే, నారిపెద్ది రామ్మూర్తి తన స్థలంలోకి వెళ్లేందుకు శ్మశాన ప్రహరీని 15 అడుగుల మేరకు కూల్చివేసి మట్టిరోడ్డు నిర్మించాడు. టీడీపీ అధికారంలో ఉందనే అహంకారంతో రోడ్డు నిర్మాణానికి శ్మశాన స్థలాన్ని సైతం ఆక్రమించాడు.
శ్మశాన స్థలంలో 20 సెంట్లు ఆక్రమణ...
శ్మశాన స్థలం పూర్తిగా ముళ్లచెట్లతో నిండిపోయి ఉండటంతో శివరామపురం గ్రామానికి చెందిన ఆలోకం సూర్యనారాయణ గ్రామ పంచాయతీ నిధులు, దాతల సహకారంతో శుభ్రం చేయించి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ శ్మశాన వాటికలో గ్రామానికి చెందిన 14 కులాల వారు దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉందని, ఏం చేసినా అడిగేవారెవరనే అహంకారంతో ఆ గ్రామ ఉపసర్పంచ్ నారిపెద్ది రామ్మూర్తి శ్మశాన స్థలంలో 20 సెంట్లు ఆక్రమించాడు. ఆక్రమణల చెర నుంచి శ్మశానాన్ని కాపాడాలని సూర్యానార్యాయణ అనేకసార్లు జిల్లా అధికారులను గ్రీవెన్స్‌సెల్లో కలిసి అర్జీలు అందజేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ ఉపసర్పంచ్ మరింత రెచ్చిపోయి తన స్థలంలోకి వెళ్లేందుకు బాట లేదంటూ.. ఆ శ్మశాన స్థలంలో నుంచే బాట వేసేందుకు గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చిందంటూ దౌర్జన్యంగా శ్మశాన ప్రహరీని 15 అడుగుల మేర కూల్చివేసి మట్టిరోడ్డు నిర్మించాడు. అధికార పార్టీ నాయకుడినంటూ రామ్మూర్తి బెదిరిస్తుండటంతో అతని తీరును గ్రామస్తులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఉపసర్పంచ్ తీరును తప్పుబడుతూ గుసగుసలాడుకుంటున్నారు. శ్మశాన స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా లక్షల రూపాయలు వెచ్చించి శ్మశానానికి నిర్మించిన ప్రహరీని కూల్చివేయడం, తన స్థలంలోకి వెళ్లేందుకు రోడ్డు నిర్మించడంపై అధికారులు స్పందించి రామ్మూర్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్మశాన స్థలానికి తిరిగి ప్రహరీ నిర్మించేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అధికార పార్టీ ఉపసర్పంచికి అధికారులు కొమ్ముకాస్తారో.. లేకుంటే గ్రామస్తులకు న్యాయం చేస్తారో వేచి చూడాలి మరి.
శ్మశాన ప్రహరీ కూల్చివేసి తన స్థలంలోకి
మట్టి రోడ్డు నిర్మాణం
పార్టీ అధికారంలో ఉందని అహంకారంతో వ్యవహరిస్తున్నాడంటూ విమర్శలు
పట్టించుకోని అధికారులు

టీడీపీ ఉప సర్పంచ్ దౌర్జన్యం