● మండుటెండలో ఆరుగంటల పాటు ధర్నా ● పోలీసుల హామీతో విరమణ
బోయినపల్లి(చొప్పదండి): ఇల్లు లేదు. భూమి లేదు.. బతుకుదెరువు లేదు.. ఇంటి పెద్ద చనిపోయాడు.. మాకు న్యాయం చేయండి సారు.. అంటూ ట్రాక్టర్ ఢీకొని సోమవారం రాత్రి మృతి చెందిన సురకాని మల్లేశం కుటుంబీకులు, బంధువులు మంగళవారం బోయినపల్లిలో ధర్నాకు దిగారు. మృతుడి భార్య గంగాజల ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఎండలో బైటాయించడం చూసేవారిని కంట తడి పెట్టించింది. గంగాధర మండలం ఉప్పరమల్యాలకు చెందిన మల్లేశం కొంతకాలంగా బోయినపల్లిలో ఉంటూ గొర్రెలకాపరిగా ఉపాధి పొందుతున్నాడు. గొర్రెలమంద వద్దకు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీ కొని మృతిచెందాడు. ఈక్రమంలో తమ కుటుంబా నికి న్యాయం చేయాలంటూ స్థానిక పోలీసుస్టేషన్ వద్దకు మృతుని కుటుంబసభ్యులు, బంధువులు చే రుకున్నారు. ప్రమాద కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్‌ను అరెస్టు చేయాలని కోరారు. అక్కడి నుంచి బోయినపల్లి–గంగాధర ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టా రు. వేములవాడ రూరల్, టౌన్ సీఐలు శ్రీనివాస్, వీరప్రసాద్, ఎస్సై పృథ్వీధర్‌గౌడ్, మారుతితో పాటు దాదాపు 50 మంది సిబ్బంది అక్కడికి చేరుకొని బందోబస్తు చేపట్టారు. దాదాపు ఆరు గంటల పాటు ధర్నా కొనసాగింది. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి సైతం ఽసంఘటన స్థలం వద్దకు వచ్చి వాకబు చేశా రు. చివరికి సాయంత్రం ఆరు గంటల సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామమని పోలీసుల హామీతో ధర్నా విరమించారు.