● జిల్లాలో 35 కేంద్రాలు
● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
● హెల్ప్‌లైన్ నంబర్ 94414 40849
సిరిసిల్ల ఎడ్యుకేషన్/చందుర్తి: నేటినుంచి జరిగే పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30గంటలకు ముగియనున్నాయి. వచ్చేనెల నాలుగో తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నుంచి 1,452 మంది, ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,144 మంది, ఆదర్శ పాఠశాలల నుంచి 590 మంది, కేజీబీవీల నుంచి 508, గురుకుల విద్యాలయాల నుంచి 1,074 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణపై గురువారం జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు పరీక్షకేంద్రాలను తెలుసుకునేందుకు వీలుగా హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 35 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటిలో 5సీ సెంటర్లుగా ఉన్నాయని తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, సిట్టింగ్‌స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జిల్లాకేంద్రంలోని గీతానగర్ బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్, తంగళ్లపల్లి, వెంకంపేట, ఇల్లంతకుంటలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
క్యూఆర్ కోడ్‌తో బుక్‌లెట్
ఈ సారి పరీక్షలకు క్యూఆర్ కోడ్‌తో ముద్రించిన 24పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు. తొలిసారిగా ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీంతో ప్రశ్నపత్రం లీక్ అయినా ఏ సెంటర్ నుంచి లీక్ అయ్యిందో సలువుగా తెలిసే ఆవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్‌లో విద్యార్థికి సంబంధించి అన్ని వివరాలు ఉంటాయి. గతంలో పదో తరగతి పరీక్షల్లో 11పేపర్లు ఉండేవి. ఈసారి ఏడు పేపర్లే ఉండనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయోలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో 12పేజీల బుక్‌లెట్‌తో నిర్వహించనున్నారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఐదు నిమిషాలు మినహాయింపు కూడా ఇచ్చారు. కేంద్రానికి 100మీటర్ల వరకు 144సెక్షన్ అమలులో ఉండనుంది.