ఊరూవాడ చెప్పుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఊరూవాడ చెప్పుకోవాలి

Published Sat, Mar 22 2025 1:46 AM | Last Updated on Sat, Mar 22 2025 1:43 AM

● రైతు రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల పేర్లు ప్రదర్శన ● గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం ● లబ్ధిదారుల వివరాలు, పేర్ల ముద్రణకు రంగం సిద్ధం ● జిల్లాలవారీగా టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ ● ఉగాది నాటికి ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నాలు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

చేసింది చెప్పుకోవాలి.. అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాము అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు, అందుకోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ప్రభుత్వం కన్నా అధిక మొత్తంలో ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతు భరోసా అమలు చేశామని, ఈ విషయాలను గ్రామస్తులు చర్చించుకునే విధంగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకోసం లబ్ధిదారుల పేర్లను గ్రామంలోని ముఖ్యవీధుల్లో ప్రదర్శించడం, తద్వారా తాము చేసిన పనులకు ఇంటింటికి తెలియజేయడం, ప్రజల మనసు గెలుచుకోవాలన్న తాపత్రయంతో వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన పలువురు యువతకు నియామక పత్రాలు ప్రభుత్వ పెద్దలు స్వయంగా అందజేస్తున్న తరహాలోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిసింది. వచ్చే స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఈ ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం.

ఏం చేస్తారు?

రైతు రుణమాఫీ, రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.కోట్లు విడుదల చేస్తోంది. అదే సమయంలో తాము అత్యధిక నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించామన్నది కాంగ్రెస్‌ వాదన. అదే సమయంలో రుణమాఫీ, రైతు భరోసా అమలు తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకే, ప్రతిపక్షాల వాదనలను సమర్థంగా తిప్పికొట్టేందుకే ప్రభుత్వం తాము చేసిన పనులను ఊరూ, వాడా చెప్పుకునేలా ఈ ఆలోచనకు తెరతీసింది. ప్రతీ గ్రామంలో కనీసం మూడు ముఖ్యమైన కూడళ్ల వద్ద ఆ గ్రామంలో రైతు భరోసా, రైతు రుణమాఫీలో ఏ రైతుకు ఎంత లబ్ధి జరిగింది? ఆ రైతు పేరు, మాఫీ వివరాలు అంకెల్లో పేర్కొంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు. వీటిని వీలైనంత మంది ఎక్కువగా ప్రజలు వీక్షించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఉగాదిలోగా టెండర్లు, ముద్రణ పూర్తి కావాలన్న లక్ష్యంతో కలెక్టర్లు, వ్యవసాయాశాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల రైతుల పూర్తి వివరాలు గణాంకాలతో సహా సిద్ధం చేశారు.

టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ

రాష్ట్రంలోని అన్నిజిల్లాల వ్యవసాఽయశాఖ అధికారులు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల్లో రైతుల పేర్ల ముద్రణకు ఫ్లెక్సీ టెండర్లు పిలిచారు. వాస్తవానికి ఈ టెండర్‌కు అనుకున్నంత ప్రచారం జరగలేదు. ఈ ప్రకటన ద్వారా వచ్చిన టెండర్లను ఖరారు చేసి త్వరలోనే అధికారికంగా ముద్రణకు ఆదేశాలివ్వనున్నారు. ఆరుగడుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఈ ఫ్లెక్సీలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ఫొటోలు ఫ్లెక్సీలో ఉండనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, ముద్రణకు ఆర్డర్‌ ఇవ్వడం, ఫ్లెక్సీలను గ్రామాల్లో కూడళ్లలో ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2.46 లక్షల మంది రైతులకు మూడు నుంచి నాలుగు దశల్లో ఇటీవల రైతు రుణమాఫీ జరిగింది. వీరికి దాదాపు రూ.రెండువేల కోట్ల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత మాఫీ అయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ స్వరూపం

జిల్లా రుణమాఫీ మాఫీ అయిన

పొందిన మొత్తం రూ.కోట్లు

రైతులు

కరీంనగర్‌ 70,348 536.55

జగిత్యాల 80,515 721.74

పెద్దపల్లి 51,827 379.52

రాజన్నసిరిసిల్ల 43,770 346.16

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement