● వట్టిమల్లలో వడగండ్ల వాన ● పలు చోట్ల విరిగిన చెట్లు
వేములవాడ/చందుర్తి/కోనరావుపేట: జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షంతో అన్నదాతలు ఆగమయ్యారు. పొట్టదశకు వచ్చిన వరిపంట చేతికి అందకుండా పోతుందని ఆందోళన చెందారు. వేములవాడ పట్టణంలో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. కోనరావుపేట మండలం వట్టిమల్లలో చెట్లు నేలకూలాయి. నిమ్మపల్లి, అజ్మీరతండా, కమ్మరిపేటతండా, రెడ్డితండా, వట్టిమల్ల గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. చేతికొచ్చిన వరి పంటలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్‌తీగలు తెగిపడడంతో నిజామాబాదు, కనగర్తి గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ముస్తాబాద్/ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి/ఇల్లంతకుంట: ముస్తాబాద్ మండలం పోతుగల్, నామాపూర్, గూడూరులలో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దుమాల, రాగట్లపల్లి, నారాయణపూర్, బండలింగంపల్లి, ఎల్లారెడ్డిపేట, రాచర్లగొల్లపల్లి, రాచర్లబొప్పాపూర్, రాజన్నపేట, అల్మాస్‌పూర్, అక్కపల్లి గ్రామాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. వీర్నపల్లి మండల కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగుపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, వెంకట్రావుపల్లి, వెల్జీపురం, ఇల్లంతకుంటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.