● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
వేములవాడరూరల్: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. మంగళవారం హన్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీ, స్టోర్ రూం, తరగతి గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. వచ్చే సంవత్సరం అడ్మిషన్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించా రు. అనంతరం లింగంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల బరువు, ఎత్తు వివరాల రిజిస్టర్‌ను పరిశీలించారు. నాణ్యమైన పోష్టికాహారం అందజేయాలని సూచించారు.
టోకెన్ పద్ధతిలో కొనుగోళ్లు
సిరిసిల్ల: యాసంగి సీజన్‌లో వరికోతలపై హర్వెస్టర్ యజమానులతో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించి నియంత్రిత విధానంలో కోతలు జరిగేలా చూడాలని, టోకెన్ విధానంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మంగళవరం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రైతులంతా ఒకేసారి ధాన్యం తీసుకువచ్చి ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడాలన్నారు. కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్, వేయింగ్ యంత్రాలు, తాగు నీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు. లారీల్లో మాత్రమే ధాన్యం తరలించాలని స్పష్టం చేశారు. కొనుగోళ్లపై ఫిర్యాదుల నమోదుకు జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీఎస్‌వో వసంతలక్ష్మి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రజిత, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, మార్కెటింగ్ శాఖ డీఎం ప్రకాష్, డీసీవో రామకృష్ణ, డీఏవో రామారావు, తూనికలు కొలతల అధికారి రూపేశ్ పాల్గొన్నారు.
నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు
జిల్లాలోని మధ్యమానేరు, అనంతగిరి జలాశయాల్లో ముంపునకు గురైన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ముంపు గ్రామాలైన గుర్రంవానిపల్లి, చీర్లవంచ, చింతలఠాణా, కొదురుపాక, రుద్రవరం, సంకెపల్లి, ఆరెపల్లి, తదితర గ్రామాల నిర్వాసితులు ఏప్రిల్ 11లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.