
మహిళా సాధికారత దిశగా ధాన్యం కొనుగోళ్లు
● శుభ్రం చేసిన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలి ● అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్
సిరిసిల్ల: మహిళా సాధికారత దిశగా జిల్లా అడుగులు వేస్తోందని, అందులో భాగంగానే ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నామని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వింటాలు ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్ధతు ధరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 172, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 57, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో ఆరు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీఎస్‌వో పి.వసంతలక్ష్మి, డీసీవో రామకృష్ణ, పౌరసరఫరాల డీఎం రజిత, జిల్లా వ్యవసాయాధికారి రామారావు, ఏపీడీ గొట్టె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.