
రాత్రివేళ.. పీహెచ్‌సీలో అందని వైద్యం
● తేలు కుట్టడంతో ఆస్పత్రికి వెళ్లిన బాధితుడు ● తలుపు తీయని సిబ్బంది ● 108లో సిరిసిల్లకు తరలింపు
కోనరావుపేట(వేములవాడ): రాత్రి వేళ ఆపదలో వస్తే బాధితులకు వైద్యసేవలు అందడం లేదు. మండల కేంద్రానికి చెందిన పని గంగారాంకు గురువారం రాత్రి 10 గంటల సమయంలో తేలు కుట్టింది. వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా సిబ్బంది బయటకు రాకపోవడంతో.. నొప్పి తీవ్రమైంది. దీంతో 108 అంబులెన్స్‌లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఈ విషయమై వైద్యాధికారి వేణుమాధవ్‌ను వివరణ కోరగా రాత్రి వేళ మద్యం సేవించి వచ్చి విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. గురువారం రాత్రి కూడా కొందరు మద్యం సేవించి వచ్చారని, వారిని వెళ్లగొట్టి తలుపులు పెట్టుకున్నట్లు తెలిపారు. మళ్లీ తలుపులు తడితే వారే కావచ్చు అని భ్రమపడ్డట్లు చెప్పారు. విధులపై నిర్లక్ష్యం వహించిన ఏఎన్‌ఎంకు మెమో జారీ చేశామన్నారు. ఆస్పత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.