ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసంతో స్వయం ఉపాధి పొందాలనుకున్న నిరుద్యోగ యువతకు నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగాలు రాని చాలా మంది యువత ఈ పథకంతో స్వయ ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుందామని ఆశపడితే ఆ స్కీమ్ నిబంధనలతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. రేషన్‌కార్డు నిబంధన తొలి అవరోధంగా మారింది. ఏప్రిల్ 4వ తేదీతో గడువు ముగియనుండడంతో చాలా మంది అర్హత కోల్పోతున్నారు. రేషన్‌కార్డు నిబంధన తొలగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
కొత్తకార్డులకు మోక్షం ఎప్పుడో..
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే ప్రజాపాలనలో వేలాది మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసి ఏడాది గడిచినా కొత్త రేషన్‌కార్డు మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం సైతం పదేళ్లుగా రేషన్‌కార్డుల జారీ, ఉన్న కార్డులో పేర్ల నమోదు చేపట్టలేదు. దీంతో కొత్తగా పెళ్లయిన దంపతులకు రేషన్‌కార్డు లేకపోగా, కార్డులు ఉన్న వారికి సంతానం కలిగితే వారి పేర్లు యాడ్ కావడం లేదు. ఇక కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారు.
బీసీ కార్పొరేషన్‌పైనే ఆశలు
బీసీ కార్పొరేషన్ ద్వారా రాజీవ్ యువవికాసంలో స్వయం ఉపాధి పొందాలని వేలాది మంది యువతీయువకులు ఆశ పడుతున్నారు. రూ.లక్ష నుంచి మూడు లక్షల వరకు మూడు విభాగాల్లో 80, 60 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రుణాలు అందజేస్తోంది. గతంలో 2022–23లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఐదు సామాజికవర్గాలకు చెందిన 1295 మందికి రూ.50వేల చొప్పున ప్రభుత్వం అందజేసింది. బీసీ కార్పొరేషన్‌కు 2018–19లో 12వేల మంది యువతీయువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా రాజీవ్ యువ వికాసానికి 15 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎన్ని యూనిట్లు మంజూరు చేశారనే విషయంపై స్పష్టత లేదు.
సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుదారులు
వీరు ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన దంపతులు బెదుర రమేశ్, లాస్య. బీఎస్సీ కంప్యూటర్ చదువుకున్న రమేశ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. భార్య లాస్య డిగ్రీ చదివింది. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించడంతో రమేశ్ దంపతులు స్వయం ఉపాధి పొందవచ్చని భావించారు. ముస్తాబాద్‌లో కర్రీ పాయింట్ పెట్టుకుందామని దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రానికి వెళ్లారు. రమేశ్‌కు రేషన్‌కార్డు లేకపోవడంతో, ఆయన దరఖాస్తును ఆన్‌లైన్‌లో స్వీకరించలేదు. తల్లిదండ్రుల పేరుతో ఉన్న కార్డులో రమేశ్ పేరు లేకపోవడం, ఇటీవల భార్య పేరుతో సహా తన పేరుతో కొత్త రేషన్‌కార్డు కోసం చేసిన దరఖాస్తుకు మోక్షం లభించలేదు. దీంతో రేషన్‌కార్డు లేక, రమేశ్ రాజీవ్ యువవికాసానికి అర్హత కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చాలా మంది యువకులు ఎదుర్కొంటున్నారు.
● రేషన్‌కార్డు నిబంధనతో అనర్హత ● దరఖాస్తులోనే చుక్కెదుర