
విదేశీ బంగారం వ్యవహారంలో ఇద్దరి అరెస్ట్
వేములవాడ: సౌదీ అరేబియా నుంచి బంగారం తీసుకొచ్చి సినీఫక్కీలో కాజేసిన వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రుద్ర రాంప్రసాద్ సౌదీ అరేబియాలోని తన సమీప బంధువు రవీందర్ ద్వారా 400 గ్రాముల బంగారం తెప్పించుకునేందుకు అతనికి రూ.35లక్షలు పంపించాడు. ఈక్రమంలో రవీందర్ తన స్నేహితుడు సౌదీలో ఉంటున్న వేములవాడకు చెందిన కాల్వ వెంకటేశ్‌కు పరిచయస్తులైన చందుర్తి మండలం జోగాపూర్‌కు చెందిన తొంటి భీరయ్య, గడ్డం అనిల్‌తో పంపించాడు. ఈ మొత్తం బంగారంను కాజేయాలని కాల్వ వెంకటేశ్, భీరయ్య, అనిల్ పథకం పన్నారు. ఈ విషయాన్ని వీరు తమ సమీప బంధువు ఇండియాలో ఉన్న ఏనుగుల నాగరాజుకు తెలిపారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే నాగరాజుకు బంగారం బిస్కెట్లు ఇవ్వడంతో అతను మొబైల్‌ఫోన్ స్విచాఫ్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తనకు సంబంధించిన వ్యక్తులకు బంగారం ఇవ్వలేదని మల్లాపూర్‌కు చెందిన రాంప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో ఏ1 కాల్వ వెంకటేశ్, ఏ4 నాగరాజు పరారీలో ఉన్నారని, వీరిని పట్టుకునేందుకు ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీరయ్య, అనిల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సౌదీఅరేబియాలో ఉన్న కాల్వ వెంకటేశ్, పరారీలో ఉన్న ఏనుగుల నాగరాజులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి పెద్ద మొత్తంలో బంగారం తీసుకురావడంలో ఇంకా ఏదైనా ముఠా హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం బంగారం రికవరీ చేయడమే కాకుండా త్వరలోనే మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు. వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్, కానిస్టేబుళ్లు ఉన్నారు.
పరారీలో మరో ఇద్దరు
సినీఫక్కీలో చేతులు మారిన బంగారం
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి