
మూలవాగును ముంచుతుండ్రు
● జేసీబీ, టిప్పర్లతో ఇసుక అక్రమ తవ్వకాలు ● బావుసాయిపేట శివారులో అడ్డుకున్న రైతులు ● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన రైతులు
సిరిసిల్ల: కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి మూలవాగును ముంచుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట శివారులోని మూలవాగులో టిప్పర్లు, జేసీబీలతో ఇసుక తరలింపును స్థానిక రైతులు మంగళవారం అడ్డుకున్నారు. వేములవాడ మండలం మర్రిపల్లి రిజర్వాయర్ కోసం ఇసుకను బావుసాయిపేట నుంచి తరలించడాన్ని అడ్డుకున్నారు. అధికారికంగా ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్‌ల నుంచి రిజర్వాయర్‌కు ఇసుకను తరలించాల్సి ఉండగా.. పొలాల మధ్య నుంచి తీసుకెళ్లడాన్ని రైతులు తప్పుపబడుతున్నారు. స్థానిక అవసరాలకు ట్రాక్టర్లతో, లేబర్లతో తీసుకెళ్లే ఇసుకను ఒకేసారి జేసీబీతో టిప్పర్ల ద్వారా తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మర్రిపల్లి రిజర్వాయర్ కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి రైతులను వారించారు. దీనిపై బావుసాయిపేట రైతులు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు ఫిర్యాదు చేశారు. భూగర్భ జలాలపై ప్రభావం చూపే ఇసుక తరలింపును నిలిపివేయాలని వారు కోరుతున్నారు.
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని బావుసాయిపేట మూలవాగు నుంచి ఇసుక తరలించడంపై రైతులు మంగళవారం నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులు బావుసాయిపేట మూలవాగులో ఇసుకరీచ్‌ను ఏర్పాటు చేశారు. పరిసర గ్రామాలకు ఇక్కడి నుంచే అనుమతులు ఇస్తున్నారు. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయంటూ రైతులు అడ్డుకున్నారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు.