
బువ్వ బాగుంది
● అప్పుడు విముఖత.. ఇప్పుడు సుముఖత ● రేషన్‌షాపుల ఎదుట కార్డుదారుల బారులు ● వారంలోనే 90 శాతం పూర్తయిన పంపిణీ ● వండుకోవడానికే ఆసక్తిచూపుతున్న పేదలు ● నూకలు వస్తున్నా, గంజి వార్చితే అన్నం బాగుంటుందంటున్న మహిళలు
సాక్షి, పెద్దపల్లి: ‘అన్నా.. వేలిముద్ర వేసిపో.. కిలోకు రూ.10 చొప్పున నీ అమౌంట్ ఇస్తా’ అని రేషన్ డీలర్లు గతంలో లబ్ధిదారులతో బేరసారాలకు దిగేవారు. ప్రస్తుతం ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది. దుకాణం తెరిచావా.. బియ్యం తీసుకోవడానికి వస్తున్నామంటూ లబ్ధిదారులే రేషన్ డీలర్లను సంప్రదిస్తున్నారు. ఉ మ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ షాపుల ఎదుట బా రులు తీరుతున్నారు. ‘పైసలు వద్దు.. సన్నబియ్యం కావాలి’ అంటున్నారు. ఉగాది నుంచి పంపిణీ చేస్తున్న సన్నబియ్యానికి కార్డుదారుల నుంచి మంచి స్పందనే వస్తోంది. గతంలో దొడ్డుబియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపనివారు.. ఇప్పుడు సన్నంబియ్యం తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
నమ్మకం కలిగిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు..
ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తదితర అధికారులు సన్నబియ్యం తీసుకునే వారి ఇళ్లలో భోజనం చేస్తున్నారు. బియ్యం నాణ్యత, మన్నికపై నమ్మకం కల్పిస్తున్నారు. ఇప్పటికే అన్నిరేషన్ షాపులకు అధికారులు నెలవారీ బియ్యం కోటా సరఫరా చేయగా, దాదాపు అన్నిదుకాణాల్లో బియ్యం పంపిణీ 90శాతానికిపైగా పంపిణీ చేశారు.
నూకలు వస్తున్నా... ముద్ద అవుతున్నా
సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఒకేరకంగా అనేక రకాలు ఉంటున్నాయని, కొన్నిదొడ్డుగా, మరికొన్ని పొట్టిగా ఉన్నాయని రేషన్‌కార్డుదారులు చెబుతున్నారు. వండితే ముద్ద అవుతుందని కొందరు, గంజి వార్చితే బాగుంటోందని మరికొందరు చెబుతున్నారు.
రేషన్ దందాకు అడ్డుకట్ట
ప్రతీనెల ఒకటి నుంచి 15 వరకు రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసేవారు. లబ్ధిదారుల వేలిముద్రని/ఐరిస్ స్కాన్ ద్వారా కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కో వ్యక్తి పేరిట 6కిలోల బియ్యం ఇచ్చేవారు. చాలామంది అనర్హులు ఉండటం, మరోవైపు బీపీఎల్ కుటుంబాలు సైతం రేషన్ బియ్యం తినడానికి ఆసక్తి చూపేవారు కాదు. దీంతో రేషన్ డీలర్లు కిలోకు రూ.10చొప్పున చెల్లించి, దొడ్డుబియ్యాన్ని దారి మళ్లించేవారు. అయినా కొందరు బియ్యం తీసుకునేందుకు వచ్చేవారు కాదు. మిగిలిన బియ్యం నిల్వ చూపించేవారు. తర్వాత నెలలో మిగిలిన బియ్యాన్ని కలిపి దుకాణానికి కేటాయింపులు చేసేవారు. కానీ, ఈనెలలో ఆ పరిస్థితి కనిపించడం లేదని, సన్నబియ్యం తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి చూపటమే కారణమని డీలర్లు వివరిస్తున్నారు.
డీలర్లపై తరుగుభారం
కార్డుదారులందరూ సన్నంబియ్యం తీసుకుంటున్నా.. చాలా తరుగు వస్తుందని రేషన్‌డీలర్లు వాపోతున్నారు. బియ్యం బస్తా 50.650 కేజీలకు 49– 48 కేజీల వరకే బరువు ఉంటోందని, తద్వారా ఒక్కోషాపులో తరుగు పేరిట క్వింటాలు నుంచి 2 క్వింటాళ్ల వరకు బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు.
సన్నంబియ్యం పంపిణీ సమాచారం
జిల్లా రేషన్‌కార్డులు లబ్ధిదారులు రేషన్‌షాపులు ప్రతీనెల
సరఫరా చేసే
బియ్యం(మెట్రిక్ టన్నుల్లో..)
కరీంనగర్ 2,75,320 8,45,761 566 5,074
పెద్దపల్లి 2,19,952 6,21,836 413 4,013
జగిత్యాల 3,07,000 8,91,000 592 5,500
సిరిసిల్ల 1,73,745 4,97,103 345 3,250