
సన్నద్ధం.. సందిగ్ధం
● గ్రామాల్లో సమ్మర్ క్యాంపులకు సై ● క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణకు శ్రీకారం ● పట్టణాల్లో నగరపాలక, మున్సిపల్ ఆధ్వర్యంలో సందిగ్ధం
కరీంనగర్ స్పోర్ట్స్: పాఠశాల విద్యా సంవత్సరం ముగుస్తోంది. త్వరలో సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలు సైతం ఏదేని క్రీడలో తర్ఫీదు పొందాలని ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వారికి సమ్మర్ క్యాంపులు ఉపయుక్తంగా ఉంటున్నాయి. 2025 ఏడాదిలో సమ్మర్ క్యాంపు నిర్వహణకు ఉమ్మడి జిల్లా క్రీడాశాఖ శ్రీకారం చుట్టింది. అయితే కరీంనగర్, రామగుండం నగరపాలకతో పాటు జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీల్లో ఆ ఊసే లేకపోవడం గమనార్హం.
మే 1 నుంచి
క్రీడాశాఖల ఆధ్వర్యంలో..
జిల్లా యువజన, క్రీడాశాఖల ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి 31వరకు వేసవి శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. ఆయా జిల్లాల్లోని పాపులారిటీ ఉన్న క్రీడాంశాల్లో ఎంపిక చేసిన 10 గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణనివ్వాలని సూచించింది. పీఈటీలకు నెల రోజుల శిక్షణ కాలానికి గౌరవ వేతనం కింద రూ.4వేలు ఇవ్వనున్నారు.
పట్టణాల్లో ఊసేలేదు!
క్రీడాశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా.. అర్బన్ ప్రాంతాల్లో ఊసే లేకుండా పోయింది. వారం రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ, రామగుండం నగరపాలక సంస్థ, సిరిసిల్లలో ఎలాంటి సన్నాహాలు ప్రారంభించడం లేదు. జగిత్యాలలో ఈసారైనా సమ్మర్ క్యాంపు నిర్వహించాలని పలువురు తల్లిదండ్రులు, క్రీడా విశ్లేషకులు కోరుతున్నారు. ఆయా బల్దియాల్లో పాలకవర్గం పదవీకాలం ముగియగా.. ప్రత్యేకాధికారులు ఈ విషయమై చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు.
క్రీడాశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఇలా..
జిల్లా చివరి తేదీ
రాజన్న సిరిసిల్ల ఈ నెల 18
జగిత్యాల ఈ నెల 19
కరీంనగర్ ఈ నెల 20
పెద్దపల్లి ఈ నెల 22