
మిగిలింది రెండు రోజులే !
● రాజీవ్ యువ వికాసానికి వెల్లువలా దరఖాస్తులు ● 14తో ముగియనున్న గడువు
గంభీరావుపేట(సిరిసిల్ల)/కోనరావుపేట(వేములవాడ): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులకు రెండు రోజులే మిగిలి ఉంది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులను తీసుకుంటున్నారు. ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు ఆన్‌లైన్ చేయనున్నారు.
ఆన్‌లైన్ సేవలకు ఇబ్బందులు
దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ గత రెండు రోజులుగా వెబ్‌సైట్ మొరాయిస్తోంది. గత నెలాఖరులో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 4న ముగిసిపోవాల్సి ఉండగా 14 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు, ఔత్సాహికులు ఆన్‌లైన్, మీసేవ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు.
యూనిట్లు ఇలా..
రాజీవ్ యువ వికాసంలో నాలుగు రకాలుగా యూనిట్లు మంజూరు చేయనున్నారు. వంద శాతం సబ్సిడీతో రూ.50వేలు, 90 శాతం సబ్సిడీతో రూ.లక్ష, 80 శాతం సబ్సిడీతో రూ.2లక్షలు, 70 శాతం సబ్సిడీతో రూ.4లక్షల వరకు మంజూరు చేస్తారు. సబ్సిడీపోను మిగతాది బ్యాంక్ లోన్.
సద్వినియోగం చేసుకోవాలి
రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈనెల 14వరకు గడువు ఉంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లోగాని, ఆఫ్‌లైన్‌లోగాని సమర్పించేందుకు వీలుంది. మండల పరిషత్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి అధికారులను అందుబాటులో ఉంచడం జరిగింది.
– రాజేందర్, ఎంపీడీవో, గంభీరావుపేట
సర్టిఫికెట్లకు దరఖాస్తు కావడం లేదు
రాజీవ్ యువశక్తి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కుల, ఆదాయం సర్టిఫికెట్లు కావాలి. వాటి కోసం దరఖాస్తు చేద్దామంటే సర్వర్ పనిచేయడం లేదు. దరఖాస్తు చేసుకున్న వారికి సర్టిఫికెట్లు కూడా రావడం లేదు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, కనగర్తి

మిగిలింది రెండు రోజులే !

మిగిలింది రెండు రోజులే !