
అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
సిరిసిల్ల: జిల్లాలో అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మొదటి విడతలో 7,000 ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీలతో సమన్వయం చేసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఆర్డీవో రాధాభాయి, హౌసింగ్ పీడీ శంకర్, డీఆర్‌డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రధాన కూడళ్లు, అప్రోచ్ రోడ్డుల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేనందున అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రదేశాల్లో రబ్బర్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు, పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. ఏఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ, జిల్లా పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే 13 బ్లాక్ స్పాట్‌లకు గుర్తించామన్నారు. ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణయ్య, డీటీవో లక్షణ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి రజిత పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జిల్లాలో యాసంగి పంట ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో కొనుగోళ్లపై సమీక్షించారు. జిల్లాలో 148 కేంద్రాలు ప్రారంభించారని, రెండుమూడు రోజులో పూర్తి స్థాయిలో ప్రారంభించాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఏవో అబ్జల్‌బేగం, డీసీవో రామకృష్ణ, డీఎస్‌వో వసంతలక్ష్మీ, పౌరసఫరాల డీఎం రజిత పాల్గొన్నారు.
గ్రౌండింగ్‌కు సహకరించాలి
రాజీవ్ యువ వికాసం పథకంలో యూనిట్ల గ్రౌండింగ్‌కు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈనెల 29లోగా అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఎల్‌డీఎం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా