
నాడు నక్సలైట్.. నేడు వంటలక్క !
● కొడుకుల కోసం జనజీవన స్రవంతిలోకి.. ● వంటలతో ఉపాధి పొందుతున్న ఎల్లవ్వ
ఇల్లంతకుంట(మానకొండూర్): సమసమాజ స్థాపన కోసం నాడు నక్సలైట్‌గా భర్త అడుగుజాడల్లో నడిచింది. నేడు బతుకుదెరువు కోసం వంటలక్కగా మారింది. పోరుబాటలో భుజాన చంటిబిడ్డను ఎత్తుకొని అడవిబాట పట్టిన మర్రి ఎల్లవ్వ.. నేడు కుటుంబ బాధ్యతలను మోస్తూ కమ్మని నోరూరించే వంటలు తయారు చేస్తోంది. కాలక్రమంలో తన జీవితంలో వచ్చిన మార్పులను మండల కేంద్రానికి చెందిన మాజీ దళ సభ్యురాలు మర్రి ఎల్లవ్వ గురించి..
భర్త వెంటే ఉద్యమబాట..
ఇల్లంతకుంటకు చెందిన మర్రి ఎల్లవ్వ తన భర్త మర్రి రాజమల్లు జనశక్తి దళ సభ్యుడిగా పనిచేసేవాడు. ఆ సమయంలో తాను కూడా పార్టీలో చేరి భర్త వెంట అడవిబాట పట్టింది. అయితే తనకు అప్పటికే చంటిపిల్లలు ఉండడంతో అడవిలో అన్నల వెంట తిరగడం ఇబ్బందిగా ఉండడంతో దాదాపు ఏడాది తర్వాత 1991లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అనంతర కాలంలో తన భర్త రాజమల్లు సైతం లొంగిపోయాడు. అయితే అనారోగ్యంతో చనిపోయాడు. ఎల్లవ్వ తన ఇద్దరు కొడుకులను పోషించుకునేందుకు కూలీ పనులకు వెళ్లింది. ప్రస్తుతం పెళ్లిళ్లు, గణపతి, దుర్గామాత ఉత్సవాలకు వంటలు చేస్తూ ఉపాధి పొందుతోంది. సొంతిల్లు లేక ఇల్లంతకుంటలో అద్దెకు ఉంటుంది. తనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, ఆదుకోవాలని ఎల్లవ్వ కోరుతుంది.