ఇబ్రహీంపట్నం రూరల్: ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి అనంత లోకాలకు చేరు కుంది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించుకుపోయింది. అమ్మా అంటూ ఆ బాలిక చివరి ఆర్తనాదాలు పెట్టింది. ఈ హృదయవిదారక సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం కుర్మల్‌గూడలోని రాజీవ్‌గృహకల్పలో నివ సించే మిర్యాల విజయలక్ష్మి, వేణుగోపాల్ దంపతులు. వారికి ముగ్గురు సంతానం. వారిలో పెద్దపాప హితిషా, చిన్నపాప భావన (6), కుమారుడు భానుప్రసాద్ ఉన్నారు.
మల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. భావన యూకేజీ చదువుతోంది. సోమవారం ఉదయం బడికి వెళ్లిన పిల్లలు సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు. భావన ఆడుకోవడానికని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటుండగా బాలా పూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు (టీఎస్ 07యుజీ 3293) డ్రైవర్ చూసుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో భావనను ఢీకొట్టాడు.
చిన్నారి తలమీద నుంచి బస్సు వెళ్లడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అప్పటి వరకు ఆనందంగా ఆడుకుంటున్న బిడ్డ అంతలోనే అనంతలోకాలకు చేరడంతో వారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ప్రమాదానికి కారణమైన బస్సు ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళన చేస్తున్నవారికి సర్దిచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment