రంగారెడ్డి: పిచ్చికుక్క దాడిలో 25 రోజుల క్రితంతీవ్రంగా గాయపడిన చిన్నారి మంగళవారం మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆగస్టు 10న బొంరాస్‌పేట మండలం రేగడిమైలారంలో ఓ కుక్క స్వైరవిహారం చేసింది. 2 గంటల వ్యవధిలో 12మందిని కరిచి గాయపర్చింది. వీరిలో ఏడుగురు చిన్నారులు కాగా ఐదుగురు పెద్దవాళ్లు ఉన్నారు.
ఇందులో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని నగరంలోని నల్లకుంట ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మిగిలిన వారిని వికారాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి పంపించారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ప్రస్తుతం మందులు వాడుతున్నారు. ఇదిలా ఉండగా ఆరోజు ఘటనలో తీవ్రంగా గాయపడిన నెల్లి అనురాధ, శ్రీనివాస్‌ల కుమారుడు ఆదిత్య(5) సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం ఉదయాన్నే ఆస్పత్రికి తరలిస్తుండగా ఆరోగ్యం విషమించి మార్గమధ్యలోనే మృతిచెందాడు.
బాధితులకు వర్షిత, ఆదిత్య ఇద్దరు సంతానం. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆదిత్య మృతితో మిగిలిన చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చికుక్కగాటు బాధితులకు ఉరుములు, మెరుపుల వాతావరణం పడదని పెద్దలు చెబుతున్నారు. వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment