హైదరాబాద్: తాను ఎంతో ఇష్టంగా విదేశాల నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్న అరుదైన చిలుక కనిపించకపోవడంతో యజమాని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక రోజు వ్యవధిలోనే ఆ చిలుకను గుర్తించి యజమానికి అప్పగించారు. ఎస్‌ఐ ఎంఎం రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్ రోడ్ నెం.44(ఏ)లో నరేంద్రచారి మైరు బిస్ట్రో కాఫీ షాపును నడిపిస్తున్నాడు. ఆయనకు పక్షులంటే మహా ప్రాణం. ఆస్ట్రేలియా జాతికి చెందిన గాలా కాక్టో అనే చిలుకను అక్కడి నుంచే తెప్పించుకొని అపురూపంగా పెంచుకుంటున్నాడు. అయితే ఇటీవల ఈ చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది. దీంతో తన చిలుక కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి దాని ఫొటోను కూడా అందించాడు.
నాలుగు నెలల వయసున్న ఈ చిలుక ఖరీదు రూ.1.30 లక్షలుగా యజమాని తెలిపాడు. ఎక్సోటిక్ బర్డ్‌గా గుర్తింపు పొందిన ఈ చిలుకను తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని, దీనికి లైసెన్స్ కూడా ఉందని రెండు కాళ్లకు ఆ దేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు రెండు రింగులు కూడా ఉంటాయని వెల్లడించారు. ఎస్‌ఐ ఈ చిలుక ఫొటోలను జూబ్లీహిల్స్‌లోని పెట్‌షాప్స్‌కు పంపించారు. ఎవరైనా ఈ చిలుకను అమ్మితే వారి వివరాలు తెలపాల్సిందిగా సూచించారు. ఓ వ్యక్తి ఈ చిలుకను ఎలా పట్టుకున్నాడో తెలియదు కానీ మూడు రోజుల క్రితం ఎర్రగడ్డలో రూ.30 వేలకు ఓ పక్షి ప్రేమికుడికి విక్రయించాడు. అదే వ్యక్తి ఆ తెల్లవారి రూ.50 వేలకు సయ్యద్ ముజాహిద్‌కు అక్కడే విక్రయించాడు.
ఈ చిలుకను కొనుగోలు చేసిన ముజాహిద్ తన వద్ద ఖరీదైన, అరుదైన గాలా కాక్టో ఆస్ట్రేలియన్ జాతి చిలుక ఉందని రూ.70 వేలకు విక్రయిస్తానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ పెట్‌షాప్ నిర్వాహకుడు ఈ స్టేటస్ చూసి జూబ్లీహిల్స్ ఎస్‌ఐకి సమాచారం ఇచ్చాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి స్టేషన్‌కు రప్పించడమే కాకుండా తన దగ్గర బంధీగా ఉన్న చిలుకను యజమాని నరేంద్రాచారికి అప్పగించారు. దాదాపు ఇక దొరకదేమో అనుకున్న తన పెంపుడు చిలుక కనిపించేసరికి నరేంద్రాచారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కష్టపడి చిలుకను పట్టుకొని అప్పగించినందుకు పోలీసులకు కతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment