
కాదేదీ కల్తీకనర్హం..
ఎలాంటి తేదీ లేకుండా మందులు
కల్తీ పదార్థాల తయారీకి జల్‌పల్లి పుట్టినిల్లుగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి కేటుగాళ్ల దందా జోరుగా సాగుతోంది. కాదేదీ కల్తీకనర్హం అన్నట్లుగా.. సీసం బట్టీలు, ప్లాస్టిక్ రీసైక్లింగ్, చాక్లెట్, బిస్కట్, కుర్‌కురే, భారీగా బీఫ్ కోల్డ్‌స్టోరేజీలు, ఎముకల నుంచి నూనే,డాల్డా తయారు చేసి ప్రజారోగ్యంతోచెలగాటం ఆడుతున్నారు. నకిలీ ఔషధాలవిక్రయానికి సాహసం చేశారు.
పహాడీషరీఫ్: జల్‌పల్లి మున్సిపాలిటీలో అక్రమ దందాలు మితిమీరిపోతున్నాయి. కొందరు అక్రమార్కులు.. ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ.. ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. శ్రీరాంకాలనీ పారిశ్రామిక వాడలో చిన్నారులు తినే చాక్లెట్లు మొదలు వంట నూనె వరకు నాసిరకం విక్రయిస్తూ రూ.లక్షలు కోట్లు దండుకుంటున్నారు. తాజాగా నకిలీ ఆస్పత్రి బాగోతం వెలుగుచూసింది.
గుండె జబ్బులు నయం చేస్తామంటూ
యునానీ వైద్యం పేరిట ప్రజల ఆరోగ్యంతో అతవుల్లా అనే వ్యక్తి ఆడుకుంటున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా అద్నాన్ కాలనీలో భారీ షెడ్డు నిర్మించారు. అందులో ఆయుర్వేదిక్, యునాని ఔషధాలు తయారు చేస్తున్నాడు. కనీసం మెడికల్ డిగ్రీ కూడా లేకుండా కేన్సర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను నయం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మిన ప్రజలు, ఇక్కడ వైద్యం చేయించుకునేందుకు మక్కువ చూపుతున్నారు. నిత్యం 200– 250 మంది వ్యాధిగ్రస్తులు రూ.4,5 వేలు వెచ్చించి మెడిసిన్ కొనుగోలు చేస్తున్నారు.
పర్యవేక్షణ కొరవడి..
మున్సిపాలిటీ వెనుక భాగంలోని అద్నాన్, శ్రీరాం కాలనీ పారిశ్రామిక వాడలు గ్రామానికి ఒక వైపుగా ఉండడంతో కేటుగాళ్లు చెలరేగుతున్నారు. వారి ఆగడాలకు చెక్ పెట్టే నాథుడే లేక కల్తీ వ్యాపారం విస్తరిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన మున్సిపాలిటీ, పోలీస్, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కల్తీ వ్యాపారం ‘మూడు పువ్వులు, ఆరు కాయలు’అన్న చందంగా సాగుతోంది. ఇలాంటి కల్తీ పదార్థాల కంపెనీలతో ఈ ప్రాంతంలో వాయు కాలుష్యం సైతం మోతాదును మించడంతో ప్రజలు శ్యాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని, ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఇలాంటి కంపెనీల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.
జల్‌పల్లి కేంద్రంగా దందా
రెచ్చిపోతున్న కేటుగాళ్లు
జోరుగా కల్తీ పదార్థాల తయారీ
ఔషధాలనూ వదలని వైనం
గుర్తింపు లేని యునానీ ఆస్పత్రి సీజ్
అతవుల్లా ఆయుర్వేదిక్, యునాని ప్రైవేట్ లిమిటెడ్ ఆస్పత్రిపై ఫిర్యాదులు అందడంతో ఆయుష్ విభాగం డైరెక్టర్ లక్ష్మీదేవి ఆదేశాను సారం.. ఆయుర్వేదిక్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ పృథ్విరాజ్, యునాని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ అనుదీప్‌ల బృందం ఈ నెల 12న ఆస్పత్రిని పరిశీలించింది. మెడిసిన్‌కు సంబంధించి ప్రామాణికమైన రీసెర్చ్, ఎలాంటి లేబుల్, తయారీ, ముగిసిన గడువు తేదీలు లేకుండానే విక్రయిస్త్నుట్లు గుర్తించారు. మెడికల్ డిగ్రీ లేకుండా ఎలా వైద్యం చేస్తారని నిర్వాహకున్ని ప్రశ్నించగా.. పూర్వికుల నుంచి నేర్చుకున్నానని సదరు వ్యక్తి సమాధానమిచ్చాడు. అనంతరం ఔషధాల శాంపిళ్లను సేకరించి డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌కు తరలించారు. ఈ నెల 21వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చినప్పటికీ.. అతవుల్లా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 22న ఆస్పత్రిని సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment