ఆక్రమణ స్థలాల సమస్య పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలిం సిటీ ఆక్రమించిన ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో గురువారం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతోనే సమస్య మరింత జటిలంగా మరుతోందని మండిపడ్డారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 60 గజాల చొప్పున నిరుపేదలకు ఇంటి స్థలాన్ని కేటాయిస్తే.. రామోజీ ఫిలింసిటీ కబంధ హస్తాల నుంచి ఆ స్థలాన్ని ఇప్పటికీ విడిపించకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ లక్ష నాగళ్లతో ఫిలింసిటీని దున్ని ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుంటామని మాటఇచ్చినా అధికారం చేపట్టిన తర్వాత రామోజీకే ఊడిగం చేశారని విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే ఫిలిం సిటీ కబ్జాలో ఉన్న భూముల్లో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. ఇళ్లు, ఇంటి స్థలాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామి ఇచ్చిందని, ఆ హామీని రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సామెల్, మండల కార్యదర్శి బుగ్గరాములు, నాయకులు జగన్, తులసిగారి నర్సింహ, గణేశ్, చెరుకూరి నర్సింహ, లింగస్వామి, ఆనంద్, జంగయ్య, అనంగంటి నర్సింహ, ప్రభుదాసు, రమేష్ పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
Comments
Please login to add a commentAdd a comment