బంజారాహిల్స్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి..ఆమెను గర్భవతిని చేసి..ఆపై ముఖం చాటేసిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఓ యువతి (25)కి అదే ప్రాంతానికి చెందిన ఎన్.శివాచారితో 2020 ఆగస్టులో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని శివాచారి నమ్మించడంతో ఆమె సన్నిహితంగా మెలిగింది. ఇటీవలే శివాచారి కేపీహెచ్‌బీకి మకాం మార్చగా యువతి కూడా బంజారాహిల్స్‌కు వచ్చి ఓ ఆస్పత్రిలో పనిచేస్తూ హాస్టల్‌లో ఉంటుంది. ఇక్కడ కూడా తరచూ కలుసుకునేవారు. ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, బలవంతంగా మాయమాటలు చెప్పి గర్భస్రావం చేయించాడు. గత నెల నుంచి శివాచారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు గమనించింది. లోతుగా ఆరా తీయగా శివాచారికి ఆరు నెలల క్రితమే మరో యువతితో నిశ్చితార్ధం జరిగినట్లుగా తెలిసింది. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. నాలుగు నెలల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు పెళ్లి చేసుకోగా మరో యువతితో నిశ్చితార్ధం చేసుకోవడమే కాకుండా తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని, వాట్సప్ బ్లాక్ చేశాడని, తనను మోసం చేశాడని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివాచారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మాచర్ల పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment