ఎస్సీ వర్గీకరణపైప్రభుత్వం ద్వంద్వ వైఖరి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణపైప్రభుత్వం ద్వంద్వ వైఖరి

Published Mon, Mar 17 2025 9:36 AM | Last Updated on Mon, Mar 17 2025 9:36 AM

ఎస్సీ

ఎస్సీ వర్గీకరణపైప్రభుత్వం ద్వంద్వ వైఖరి

షాద్‌నగర్‌: ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ స్పష్టం చేశారు. వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల పరీక్ష ఫలితాలను నిలుపుదల చేయా లని డిమాండ్‌ చేస్తూ పట్టణంలో చేపట్టిన దీక్షలు ఆదివారం ఏడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై గత ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారని, ఈ మేరకు ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు వర్గీకరణ వర్తింజేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేశారన్నారు. అసెంబ్లీలో ఈనెల 18న చట్టం చేస్తామని చెబుతూనే మరోవైపు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, చెన్నగళ్ల శ్రావణ్‌, పాండు, యాదగిరి, జోగు శ్రీశైలం, శ్రీను, హరీష్‌, వినోద్‌, మధు, శివశంకర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయాలి

షాద్‌నగర్‌: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంగుడ్ల బిల్లులు, మూడు నెలల నుంచి గౌరవ వేతనం, మెనూ చార్జీలు చెల్లించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బిల్లులు ఇవ్వకుంటే విద్యార్థులకు ఎలా భోజనం అందిస్తారని ప్రశ్నించారు. రోజు రోజుకూ నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లను ఏవిధంగా సరఫరా చేస్తుందో అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు అలివేలు, కార్మికులు శ్రీలత, శ్రీనివాస్‌, వసంత, సంతోష, సత్తెమ్మ, వెంకటమ్మ, అనిత, షాహినీబేగం తదితరులు పాల్గొన్నారు.

వంద శాతం పన్నులు వసూలు చేయాలి

ఇబ్రహీంపట్నం: ఈనెలాఖరులోగా వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని డీఎల్‌పీఓ సాధన పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండలంలోని ముకునూర్‌లో వివిధ రకాల టాక్స్‌ల వసూళ్లను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 31లోగా వంద శాతం పన్నులు వసూలు చేయాలన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆమె వెంట పంచాయతీ సిబ్బంది శ్రీకాంత్‌, ఉస్మాన్‌, అశోక్‌ ఉన్నారు.

నేడు ఓయూ బంద్‌కు పిలుపు

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలో ఆందోళనలపై అధికారులు విధించిన నిషేధంపై విద్యార్థి సంఘాల నేతలు, ప్రొఫెసర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్‌ఎస్‌వీ, ఎంఎస్‌ఎఫ్‌, దళిత, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట సమావేశమై అధికారుల తీరుపై మండిపడ్డారు. యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించలేని, పాలన చేతకాని వీసీ ప్రొ.కుమార్‌ విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధించడం సిగ్గుచేటన్నారు. ఆందోళనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వీసీ ప్రొ.కుమార్‌ నియంతృత్వ పోకడలకు, ఆందోళనలపై నిషేధాలకు వ్యతిరేకంగా సోమవారం ఓయూ బంద్‌కు ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు.

ఎస్సీ వర్గీకరణపైప్రభుత్వం ద్వంద్వ వైఖరి 1
1/1

ఎస్సీ వర్గీకరణపైప్రభుత్వం ద్వంద్వ వైఖరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement