ఆమనగల్లు: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆమనగల్లు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన వసతులు ఉన్నాయా లేదా అని ఆయన పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఎంఈఓ పాండు, చీఫ్ సూపరింటెండెంట్‌లు శ్రీధర్, ప్రభాకర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో అలసత్వం తగదని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా ఉండాలని, తగినంత వెలుతురు వచ్చేలా చూడాలని సూచించారు.
సీఎస్‌పై డీఈఓ ఆగ్రహం!
ఆమనగల్లులోని బాలికల ఉన్నత పాఠశాల ఎస్‌ఎస్‌సీ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌రెడ్డిపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరీక్షల కోసం సీసీగా నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడిని నియమించడంపై సీఎస్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. పక్కజిల్లా నుంచి సీసీగా ఉపాధ్యాయుడిని తీసుకోవాల్సిన అవసరం ఏమిటని నిలదీసినట్టు తెలిసింది. కాగా సీసీని శుక్రవారం రోజే రిలీవ్ చేశామని సీఎస్ ప్రభాకర్‌రెడ్డి డీఈఓ సుశీందర్‌రావ్‌కు వివరించినట్టు సమాచారం.
జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు