సాక్షి, సిటీబ్యూరో: ట్రేడింగ్ ఫ్రాడ్ చేసే సైబర్ నేరగాళ్లకు అవసరమైన బ్యాంకు ఖాతాలు అందిస్తున్న గుర్‌గావ్ వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై దేశంలో 43 కేసులు, రాష్ట్రంలో ఆరు కేసులు ఉన్నట్లు డీసీపీ దార కవిత మంగళవారం తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన హిమాన్షు స్వామి ప్రస్తుతం గుర్‌గావ్‌లో నివసిస్తున్నాడు. ఇతడు పవన్ జైన్‌తో కలిసి బ్యాంకు ఖాతాలు సమీకరిస్తూ సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నాడు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి సోషల్‌మీడియా ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరుతో రూ.20 లక్షలు స్వాహా చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు హిమాన్షు, పవన్ పాత్రను గుర్తించారు. గుర్‌గావ్ వెళ్లిన ప్రత్యేక బృందం హిమాన్షును అరెస్టు చేసింది. పరారీలో ఉన్న పవన్ కోసం గాలిస్తోంది.
బస్సు కింద పడి మహిళ మృతి
బొల్లారం: ఉద్యోగానికి బయలుదేరిన మహిళ యాక్సిడెంట్‌కు గురై మృతిచెందిన ఘటన తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. తిరుమలగిరి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని త్రివేణి కుమారి(43) అల్వాల్ ఎంఈఎస్ కాలనీలో నివాసం ఉంటోంది. మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు లాల్‌బజార్ బస్టాప్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను ఓ కారు ఢీకొట్టడడంతో రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న కంటోన్మెంట్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆమె పైనుంచి వెళ్లింది. దీంతో త్రివేణి కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారు, బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని త్రివేణి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ నరేశ్, కారు డ్రైవర్ రమేశ్‌లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు
పరిగి: ఆటో బైక్ ఢీకొనడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బందయ్య, అంజమ్మ పరిగి నుంచి ఇంటికి వెళ్తుండగా కొడంగల్ వైపు నుంచి వస్తున్న ఆటో బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 సహాయంతో పరిగి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నగరానికి తరలించినట్టు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
మోమిన్‌పేట:ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. అంరాధికలాన్ గ్రామానికి చెందిన ఈర్లపల్లి కుమార్(42) కుటుంబ అవసరాల కోసం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొడుకుకు చికిత్స చేయించేందుకు అప్పు లు చేశాడు. ఇవి తీరే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గత ఆదివా రం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. గమ నించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.