ఇబ్రహీంపట్నం: రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమణలో ఉన్న పేదల ఇళ్ల స్థలాలు, 370 ఎకరాల ప్రభుత్వ భూమిని విడిపించుకునేందుకు మరో పోరాటానికి సిద్ధమవుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామేల్ అన్నారు. ఇబ్రహీంపట్నం పాషనరహరి స్మారక కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాగన్‌పల్లి రెవెన్యూ పరిధిలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల్లోకి బుధవారం లబ్ధిదారులు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం, అరెస్టులు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఫిలింసిటీ యాజమాన్యంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కమ్మకై ్క లబ్ధిదారులైన పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. 18 ఏళ్లుగా తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ఇంటి స్థలాల లబ్ధిదారులపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కోసం సేకరించిన భూములను తాము అధికారంలోకి వస్తే తిరిగి రైతులకు ఇచ్చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేసిందని వారు విమర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో మరో 2,500 ఎకరాల భూసేకరణకు రంగం సిద్ధం చేయడం ఏమిటని నిలదీశారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు బుగ్గరాములు, జంగయ్య, జగన్, నర్సింహ, యాదయ్య, బాలరాజ్, శ్రీను, చరణ్, యాదగిరి, ఎల్లేష్ పాల్గొన్నారు.
రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణలో ఉన్న 370 ఎకరాలను విడిపిస్తాం
సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య