
పరిధికి మించి వైద్యం చేస్తే చర్యలు
షాద్‌నగర్: ఆర్‌ఎంపీలు పరిధికి మించి వైద్యం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు హెచ్చరించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎంపీలు తమ పరిధికి లోబడి రోగులకు ఫస్ట్ ఎయిడ్ నిర్వహించాలని సూచించారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ అనే పదాన్ని వాడుకోవద్దని, కేవలం ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే రాయాలన్నారు. ఆస్పత్రుల నిర్వహణకు విధిగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు పొందాలన్నారు. ఎవరికై నా జలుబు, దగ్గు, జ్వరం తదితర వాటితో పాటు ఇతర ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా నైపుణ్యం కలిగిన వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేందుకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. పట్టణంలోని ఆస్పత్రులు, పాలీక్లినిక్‌లను తనిఖీ చేసి కీర్తి పాలీక్లినిక్, ప్రజా వైద్యశాల, రాజా మెడికల్ హాల్ వెనుక భాగంలో ఉన్న దవాఖాన, మనిశ్విని క్లినిక్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు