
కురుమలు అన్ని రంగాల్లో ఎదగాలి
చేవెళ్ల: కురుమలు ఐకమత్యంతో అన్ని రంగాల్లో ఎదగాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఆకాంక్షించారు. మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లిలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న సంఘం నూతన భవనాన్ని శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు అందించే రుణాలను కురుమలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పారు. కుల వృత్తితోపాటు ఇతర ఉపాధి మార్గాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కురుమలు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో రాణించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం, రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నారు. కురుమల ఐక్యతనుచాటే విధంగా అన్ని గ్రామాల్లో సంఘాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కురుమ సంఘం నాయకుడు, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పనాగేశ్, పలు పార్టీల నాయకులు, కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.