
భూ భారతి చట్టం ఎంతో మేలు
ఆమనగల్లు: భూ భారతి చట్టం–2025 ద్వారా రైతు లు, పేదలకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ చట్టంతో బాధితులకు న్యాయ సలహా వ్యవస్థ ఉంటుందని చెప్పారు. పట్టణంలోని ఓ గార్డెన్స్‌లో శుక్రవారం భూ భారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం 2025పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి చట్టంతో భూమి హక్కులు పరిరక్షించబడతాయని తెలిపారు. ధరణితో ప్రజలు అధికారుల వద్దకు వచ్చారని, భూ భారతి చట్టంతో అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు. త్వరలో గ్రామ రెవెన్యూ అధికారులు, అన్ని మండలాలకు సర్వేయర్ల నియామకం జరుగుతుందన్నారు. భూభారతి ద్వారా 90 శాతం సమస్యలు స్థానికంగానే పరిష్కారమవుతాయని వివరించారు. రైతులకు అన్యాయం జరిగితే ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్‌ఏ స్థాయిల్లో అప్పీల్ చేసుకోవచ్చన్నారు. వచ్చే నెలలో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ లలిత, ఆమనగల్లు మార్కెట్‌చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్, వైస్ చైర్మన్ సత్యం, ఎంపీడీఓ కుసుమమాధురి, ఏడీఏ శోభారాణి, ఏఓ అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్, ఎంఈఓ పాండు, ఎస్‌ఐ వెంకటేశ్ పాల్గొన్నారు.
భూ భారతితో భూ హక్కుల పరిరక్షణ
మాడ్గుల: భూ భారతి చట్టంతో భూమి హక్కులు పరిరక్షించబడతాయని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హల్‌లో శుక్రవారం తహసీల్దార్ వినయ్ సాగర్ అధ్యక్షతన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో భూ సమస్యలన్నీ సత్వరం పరిష్కరించబడతాయని పేర్కొన్నారు. దీనిపై మే 1 నుంచి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు రాంరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి