Telangana: సోదాలు, దాడుల కాలమిది! | Malla Reddy IT Raids: Special Story On Telangana Raids | Sakshi
Sakshi News home page

తెలంగాణలో సోదాలు, దాడుల కాలమిది!

Published Wed, Nov 23 2022 8:42 PM | Last Updated on Wed, Nov 23 2022 8:50 PM

Malla Reddy IT Raids: Special Story On Telangana Raids - Sakshi

తెలంగాణాలో  రాజకీయ సమరం ప్రస్తుతం దర్యాప్తు సంస్థల రూపంలో సాగుతోంది. రాష్ట్ర పోలీసులు బీజేపీ పెద్ద నేతలలో ఒకరైన బీఎల్‌ సంతోష్‌కు విచారణ నిమిత్తం రావాలని నోటీసు పంపితే, కేంద్ర ఆదాయ పన్నుశాఖ రాష్ట్రమంత్రి మల్లారెడ్డి ఇంటిలోనూ, ఆయనకు సంబంధించిన వారి ఇళ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించింది. అయితే, ఢిల్లీ లిక్కర్  స్కామ్ ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆలోచన అందరి మదిలో ఉన్న సమయంలో మల్లారెడ్డిపై దాడి జరగడం విశేషం. కింది స్థాయి నుంచి పైకి ఎదిగి, ఇప్పుడు యూనివర్శిటీ, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల స్థాపనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మల్లారెడ్డి వివాదాలకు అతీతుడేమీ కాదు. ఆయన రాజకీయాల్లోకి ఒకందుకు వస్తే, అది ఇప్పుడు మరొకందుకా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.

అలా ఎదిగారు.. ఇలా చిక్కారు.!
2014లో మల్లారెడ్డి తెలుగుదేశం టిక్కెట్ సంపాదించి మల్కాజిగిరి నుంచి పోటీ చేసినప్పుడే రాష్ట్రవ్యాప్తంగా  రాజకీయంగా గుర్తింపు పొందారు. పక్కా తెలంగాణ యాస, భాషలో మాట్లాడే మల్లారెడ్డి తన వ్యవహార శైలితో భిన్నంగా కనిపిస్తారు. అప్పట్లో టీడీపీలోనే ఉన్న రేవంత్ రెడ్డి కూడా మల్కాజిగిరి టిక్కెట్ ఆశించారు. కానీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మల్లారెడ్డి వైపు మొగ్గు చూపారు. దానికి కారణం మల్లారెడ్డి టీడీపీకి భారీగా నిధులు సమకూర్చడమేనని రేవంత్ ఆరోపించేవారు. దీనిపై పార్టీలో పంచాయితీ కూడా జరిగింది. ఆనాటి రాజకీయ పరిణామాలు కలిసి వచ్చి మల్లారెడ్డి ఎంపీ అయ్యారు. తదుపరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చిక్కుకుని రాత్రికి రాత్రి పెట్టేబేడ సర్దుకుని విజయవాడ వెళ్లిపోవడంతో మొత్తం రాజకీయం టీఆర్ఎస్ కంట్రోల్‌లోకి వెళ్లింది. టీడీపీ ఎమ్మెల్యేలు పలువురిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకర్షించారు. ఆ క్రమంలోనే మల్లారెడ్డిని కూడా పార్టీలోకి తీసుకువచ్చారు. తదుపరి శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి టీఆర్ఎస్ పక్షాన పోటీచేసి భారీ విజయం సాధించారు. ఆ వెంటనే రాష్ట్ర మంత్రి కూడా అయిపోయారు. 

సోదాలకు, రాజకీయాలకు లింకు?
మల్లారెడ్డి మాటకారితనంతో పాటు, ఆయన ఆర్ధిక స్థోమత కూడా ఇందుకు బాగా ఉపయోగపడిందని నియోజకవర్గ ప్రజలు భావిస్తారు. అప్పటి నుంచి ఆయా సందర్భాలలో మల్లారెడ్డి వార్తలలోకి ఎక్కారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బహిరంగంగా మద్యం తీసుకుంటూ, దానిని సమర్ధిస్తూ మాట్లాడిన వైనం ప్రముఖంగా ప్రచారం అయింది. ఇప్పుడు ఐటీ దాడుల ద్వారా ఆయన వార్తల్లోని వ్యక్తి అయ్యారు. సాధారణంగా ఐటీ దాడులు జరిగితే పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. అన్నిచోట్ల జరిగినట్లే సోదాలు జరిపి, డబ్బు ఏమైనా దొరికినా, పన్నులు సరిగా కట్టలేదని తేలినా  అధికారులు నోటీసులు ఇచ్చి వివరణ కోరి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారు. ఇది రొటీన్ వ్యవహారం. కానీ.. మల్లారెడ్డి మంత్రి కావడం, ఇటీవలి కాలంలో టీఆర్ఎస్‌కు, బీజేపీకి మధ్య హోరాహోరీ రాజకీయ యుద్దం సాగుతుండటంతో దాని ప్రభావం మొట్టమొదటగా మల్లారెడ్డిపైన పడినట్లుగా ఉంది. 

అటు కారు, ఇటు కమలం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ తరఫున కొనుగోలు చేసే యత్నం చేశారంటూ ముగ్గురు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత ఒక సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును మరీ సీరియస్‌గా మార్చడంతో పరిస్థితి హద్దులు దాటిపోయినట్లుగా ఉంది. ఏకంగా కేంద్ర బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు పోలీసులు నోటీసు ఇవ్వడాన్ని కాషాయ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వెరసి ఐటీ దాడి జరిగిందన్నది అందరి అభిప్రాయంగా ఉంది. ఈ దాడిలో  ఏమీ దొరక్కపోతే టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎదురు దాడి చేసి ఉండేది. కానీ.. మల్లారెడ్డి, ఆయన బంధువుల వద్ద ఎనిమిదిన్నర కోట్ల రూపాయల నగదు దొరకడం కలకలం రేపుతోంది. దీనికి వివరణ ఇచ్చుకోవడం తలకు మించిన పనే అవుతుంది. నోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నోట్లు దొరికితే అది పెద్ద విషయమే అవుతుంది. అందులోను రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందా అనే ఉత్కంఠ ఏర్పడింది. 

జవాబు లేని ప్రశ్నలెన్నో!
మల్లారెడ్డి తన సెల్ ఫోన్ ఎక్కడో ఒక జనప బ్యాగ్‌లో దాచారన్న విమర్శలు సందేహాలకు తావిస్తున్నాయి. మరో బంధువు తన ఇంటి తలుపులు తీయకుండా అడ్డుకోవడం, అధికారులు తలుపులు పగలకొట్టడం వంటి ఘట్టాలు మల్లారెడ్డికి ఇబ్బంది కలిగించేవి. దీనిని టీఆర్ఎస్ సమర్ధించుకోవడం కూడా కష్టమే అవుతుంది. పట్టుబడ్డ కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? మెడికల్ కాలేజీ సీట్లను బ్లాక్‌లో అమ్మడం వల్ల వచ్చాయా? ఇంకేదైనా రూట్‌లో వచ్చాయా? అన్నదానికి వీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సమావేశంలో ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ఎంత హెచ్చరించినా, ఎవరి మీద ఏ సంస్థ దాడి చేస్తుందో ఊహించడం కష్టమే. అంతేకాక ఎవరిని నమ్మి ఇంత డబ్బు ఎక్కడ పెడతారు?. టీఆర్ఎస్, బీజేపీ గొడవ కాస్తా రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య రగడగా మారిందా?. బీజేపీని వదిలేదిలేదని కేసీఆర్ చర్యలు చేపడితే, కేసీఆర్‌ను సహించబోమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనడం ఎలాంటి సంకేతాలిస్తున్నాయి?. ఈ ప్రహసనంలో సీఎం కేసీఆర్ ఇబ్బంది పడతారా? లేక ఆయన బీజేపీపై చేయి సాధిస్తారా? అన్నది తేలడానికి మరి ఎక్కువ కాలం పట్టకపోవచ్చేమో!

హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement