Nanjiyamma: ప్రకృతి తల్లి పాటకు పట్టాభిషేకం | Meet National Best Singer Ayyappanum Koshiyum Nanjiyamma Her Life | Sakshi
Sakshi News home page

చెట్టూపుట్టలను చూస్తూ పాట పాడింది.. ఈ అమ్మ జాతీయ అవార్డు గెల్చుకుంది

Published Sat, Jul 23 2022 10:00 AM | Last Updated on Sat, Jul 23 2022 11:58 AM

Meet National Best Singer Ayyappanum Koshiyum Nanjiyamma Her Life - Sakshi

‘‘ఉన్నపళంగా నా కొడుకు ఫోన్‌ చేశాడు. అమ్మా.. ఒక్కసారి టీవీ చూడే అన్నాడు. నాకు దేశం నుంచి ఏదో అవార్డు వచ్చిందని చెప్పాడు. ఈ అవార్డు ఏంటో నాకు తెల్వదు. దాని గొప్పతనం ఏంటో కూడా తెల్వదు. కానీ, నా కొడుకు మాటలే నాకు సంతోషాన్ని ఇచ్చాయి. అసలు ఈ వయసులో సినిమా పాటలు పాడతానని, నటిస్తానని ఎవరైనా అనుకుంటారా?’’ అని అమాయకపు నవ్వులతో చెప్తోంది అరవై ఏళ్ల వయసున్న నాంజియమ్మ. అయ్యప్పనుమ్ కోషియుమ్‌ చిత్రంలో ‘కళకాత్తా సందనమేరే’.. పాటకు 2020-నేషనల్‌ బెస్ట్‌ సింగర్‌ అవార్డుకు ఎంపికైంది ఈ తల్లి. 

పుట్టింది ఎక్కడో మామూలు గిరిజన పల్లెలో. కాకపోతే.. జానపద కళాకారిణి. సినిమా అంటే ఏంటో తెలుసు. కానీ, అందులో నటించే వాళ్లు ఎవరు? వాళ్ల పేర్లేంటి? వాళ్ల గురించి ఆమెకు ఎంత మాత్రం అవగాహన లేదు. కేవలం ప్రకృతిని.. దాని నుంచి పుట్టిన పాటల్ని నమ్ముకుని పెరిగింది నాంజియమ్మ. అలాంటిది ఒక్క సినిమాతోనే ఇవాళ దేశం ఆమె గురించి మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది. అన్నట్లు.. ఆ పాటకు సాహిత్యం కూడా ఆమెదే. అందుకే పాట రచయిత కూడా సంతోషంగా ఉన్నారా? అంటే.. ‘అవును..’ అంటూ ముసిముసి నవ్వులతో బదులు ఇచ్చింది. 

పలక్కడ్‌ జిల్లా అట్టపడి.. కేరళలో ఉన్న ఏకైక గిరిజన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ చిత్రం షూటింగ్‌ చేసుకుంది. 2020లో వచ్చిన ఈ చిత్రం మాలీవుడ్‌లో ఓ చెరగని ముద్ర వేసుకుంది. ఈ చిత్ర దర్శకుడు, రచయిత సాచీకి ఇది రెండో చిత్రం.. దురదృష్టవశాత్తూ ఆఖరి చిత్రం కూడా. అయితే ఆ ప్రాంతంతోనే ముడిపడిన సినిమా కావడంతో.. అక్కడి కల్చర్‌నే సినిమాలో ఎక్కువ భాగం చేశాడు ఆయన. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. నాంజియమ్మ గురించే. 

అట్టపడిలో నుక్కుపథి పిరివు అనే గిరిజన పల్లె నాంజియమ్మ స్వగ్రామం. ఇరుల గిరిజన తెగకు చెందిన ఈమె.. జానపద కళాకారిని. ప్రకృతిని నమ్ముకున్న నాంజియమ్మ.. చెట్టు, గట్టు, పుట్ట, పశువులను చూస్తూనే అలవోకగా పాటలు పాడుతుంది. గిరిజన కళాకారుల సంఘం ఆట కళాసంఘం, ఆజాద్‌ కళా సమితిలో ఆమె సభ్యురాలు కూడా. పళని స్వామి ఆజాద్‌ కళా సమితి వ్యవస్థాపకుడు. ఈయన ద్వారానే నాంజియమ్మ గురించి తెలుసుకున్న సాచీ.. పాడేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. 

ఇరుల భాషకు ఒక లిపి అంటూ లేదు. అందుకే అదే భాషలో ఆశువుగా మాట్లాడడం, పాడడం నేర్చుకుంది నాంజియమ్మ. పదిహేనేళ్ల వయసులో వివాహం చేసుకున్న ఆమెకి.. భర్త ప్రోత్సహం కొండంత బలాన్ని ఇచ్చింది. ఆమెకు ఒక కొడుకు.. ఒక కూతురు. కొడుకు అగలిలోని ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో ఉద్యోగి. ఇక దశాబ్దాలుగా వ్యవసాయం, పశువులను మేపుతూనే ఆమె జీవనం కొనసాగిస్తోంది. ఆ సమయంలోనే పాటల్ని సృష్టించుకుని.. పాడుతుంటుంది. అదే జీవనశైలిలోనే ఇంకా బతుకుతోంది. అన్నట్లు సినిమాలో టైటిల్‌ ట్రాక్‌ తో సహా మూడు పాటలు ఆమె పాడారు. అంతేకాదు.. చిత్రంలో ప్రధాన పాత్రధారి అయ్యప్పన్‌ క్యారెక్టర్‌కి అత్త క్యారెక్టర్‌లోనూ మెరిశారు ఆమె.


పళని(ఎడమ), జేక్స్‌ బిజోయ్‌తో..

కళకాత్తా సందనమేరే.. ఈ పాట నంజియమ్మ జీవితానికి ముడిపడిన పాట. అందుకే సంగీత దర్శకుడు జేక్స్‌ బిజోయ్‌‌.. రికార్డింగ్‌ సమయంలో నాంజియమ్మకు ఎంతో సహకారం అందించాడు. పరాయి, దావిల్, కోకల్, జల్త్రా వంటి సాంప్రదాయ గిరిజన వాయిద్యాలను పాటలో ఉపయోగించాడు. ఆమె ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని.. అందుకు తగ్గట్లుగానే సాంగ్స్‌ రీ-రికార్డ్‌ చేయించాడు.ఈ పాట యూట్యూబ్‌లో రిలీజ్‌ అయిన నెల రోజులకే 10 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకుంది. మలయాళీలకు మాత్రమే కాదు.. సౌత్‌ చిత్రాలకు ఆదరించే ఎందరికో ఇదొక ఫేవరెట్‌ సాంగ్‌.  అటవీ భూముల్లోని గంధపుచెట్లు, పువ్వులు, వృక్షజాలాన్ని వివరిస్తుంది ఈ పాట. మనవళ్లకు గోరు ముద్దులు తినిపించే అవ్వల తాలుకా భావోద్వేగాలను పంచుతుంది కూడా. (క్లిక్: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది)
- సాక్షి, వెబ్‌ స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement