గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జైల్ నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. కాషాయ పార్టీ మాత్రం ఇంకా సస్పెన్షన్ వేటుపై ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. రాజాసింగ్‌పై బీజేపీ హై కమాండ్ ఆలోచనేంటి ? నియోజకవర్గానికే పరిమితం అవుతురా? కొత్త వేదిక ఏర్పాటు చేసుకుంటారా?
బెయిల్ వచ్చింది కానీ!
కాంట్రవర్సీ కామెంట్స్‌తో కటకటాలపాలైన రాజాసింగ్ బెయిల్‌పై బయటకు వచ్చినా.. బీజేపీ అధిష్టానం మాత్రం సస్పెన్షన్ వేటు ఫైల్‌ను ఎత్తేయలేదు. దీంతో, రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఆలోచనలో పడ్డారు. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలో రాజాసింగ్ గురించి చర్చించారట. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను అమిత్ షా కూడా తప్పుపట్టారట. రాజాసింగ్‌పై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సానుకూలంగా ఉన్నప్పటికీ సస్పెన్షన్‌పై అధిష్టానం ఇప్పట్లో నిర్ణయం ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది.
మా మాట వినండి సార్..
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఇటీవల రాజాసింగ్ భార్య కలిశారు. అంతకుముందే రాజాసింగ్ పార్టీకి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇచ్చారు. ఇక, రాజాసింగ్‌పై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది బీజేపీ నేతలతో రాజాసింగ్‌కు విభేదాలున్నాయి. అదే ఇప్పుడు రాజాసింగ్‌కు, పార్టీకి మధ్య అగాధం పెంచుతున్నాయి. కేంద్రంలోనూ రాజాసింగ్‌కు సపోర్గ్‌గా నిలిచే వారు ఉన్నప్పటికీ బహిరంగంగా బయటకు రాలేకపోతున్నారు.
పార్టీ పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి?
రాజాసింగ్ ప్రస్తుతం తన నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ తనపై వేటు తొలగించని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సన్నిహితులతో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలా?. బీజేపీకి వ్యతిరేకం కాకుండా సొంతంగా ఒక కొత్త వేదిక ఏర్పాటు చేసుకోవాలా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. మొత్తంగా రాజాసింగ్ వ్యూహం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment