వాటర్ బాటిల్ మొదలు బకెట్ నీటిని ఎత్తడానికి పడే కష్టం. ఒక చెయిర్‌ను అటు ఇటు జరపడానికి పడే ఇబ్బంది.. సాధారణంగా వయసు మీద పడిన సమయంలో ఇలాంటివి తప్పదు. అయితే ఇలాంటి బలహీనతలే మధ్యవయస్కులో.. అదీ ప్రతీరోజూ కనిపించిందంటే.. అది ‘మమోసైటిస్’ లక్షణంగా భావించాల్సి ఉంటుంది. నటి సమంతకు మయోసైటిస్ సోకిందనే వార్త.. ఆమె ఫ్యాన్స్‌తో పాటు తారాలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. లక్షలో.. నలుగురి నుంచి 20 మంది దాకా.. సోకే ఈ అరుదైన వ్యాధి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్.. ‘మయోసైటిస్’. అరుదైన వ్యాధి మాత్రమే కాదు.. నొప్పులు, అలసటతో పేషెంట్‌కు నరకం చూపిస్తుంటుంది. ఈ వ్యాధిలో మొత్తం ఐదు రకాలు ఉన్నాయి.
పాలిమయోసైటిస్: చిన్న చిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పిపెడతాయి. కొంతదూరం నడిచినా త్వరగా అలసిపోతారు. ఒక్కోసారి అదుపు తప్పి కిందపడిపోతారు.
డెర్మటోమయోసైటిస్: కండరాలపై ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. అతినీలాలోహిత కిరణాల ప్రభావం వల్ల ఈ రకమైన స్థితి నెలకొంటుందనే వాదన కూడా ఒకటి ఉంది. మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
నెక్రోటైజింగ్ మయోపతి: శరీర మధ్యస్థ భాగాల్లో కండరాలపై ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. మోచేతులు, తొడలు, నడుము, భుజాలు, మెడ, వెనుక భాగంలో బలహీనత కారణంగా నొప్పి ఉంటుంది.
ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్: నీరసం, తొడ, ముంజేతి, మోకాలి కింద కండరాలు పట్టేసి, నొప్పిగా అనిపిస్తాయి. ఐదు పదుల వయసు దాటిన వారిలో ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి.
జువెనైల్ ఫామ్స్ ఆఫ్ మయోసైటిస్: పిల్లల్లో, యుక్తవయసు ఉన్నవాళ్లలో ప్రభావం చూపెడుతుంది.
చాలా కష్టం!
మయోసిటిస్ స్థితిని నిర్ధారించడం.. చికిత్స అందించడం కొంచెం కష్టం. నయం కాని వ్యాధిగా దీనికంటూ ఓ పేరుంది. అలాగే దీనికంటూ ప్రత్యేకమైన చికిత్సా విధానం లేదు కూడా!. కానీ, సరైన మందులు, పద్ధతిగా థెరపీలతో వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు. ప్రత్యేకించి మయోసైటిస్ రకాల్లో.. ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్‌కు మాత్రం ఎలాంటి చికిత్స విధానం లేదు!.
మయోసైటిస్ లక్షణాలు..
మయోసైటిస్.. ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రబావం చూపెడుతుంది. కండరాల బలహీనత, నొప్పులు, విపరీతమైన అలసట.. కామన్ లక్షణాలుగా కనిపిస్తుంటాయి. అయితే ఒక్కోరకం మయోసైటిస్‌లో బలహీన స్థితి ఒక్కోలా, ఇంకొన్ని అదనపు లక్షణాలు సైతం కనిపించొచ్చు. ఉదాహరణకు.. డెర్మటోమయోసైటిస్‌లో ముఖం, ఛాతీ భాగం, భుజాలు, మెడ వెనుక భాగంపై మచ్చల దద్దుర్లు వస్తాయి.. అవి నొప్పిని కలిగిస్తాయి కూడా.
మయోసైటిస్ వ్యాధి ఎందుకు వస్తుందనే దానికి సరైన కారణాలను ఇంతవరకు పరిశోధకులు గుర్తించలేకపోయారు. అయితే.. కొందరిలో మాత్రం జన్యుసంక్రమణగా ఈ వ్యాధి సొకవచ్చనే అంచనాకి మాత్రం వచ్చారు. మహిళలో 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా మయోసైటిస్ బారిన పడుతున్నట్లు పలు యూనివర్సిటీలు నిర్వహిస్తున్న సర్వేలు వెల్లడించాయి.
కండరాల బలహీనత, అలసట, దద్దుర్లు ఆధారంగా ఆ స్థితిని మయోసైటిస్ అనుకోవడానికి వీల్లేదు. అత్యంత అరుదైన ఈ స్థితిని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు. రుమటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, డెర్మాటోమయోసైటిస్ స్థితిలో డెర్మటాలజిస్టులను సంప్రదించడం ద్వారా ఈ వ్యాధి స్థితిపై ఒక అంచానికి రావొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment