సదాశివపేట మార్కెట్‌కు ఉల్లిగడ్డను అమ్మకానికి తీసుకువచ్చిన రైతులు
సదాశివపేట (సంగారెడ్డి): కోస్తుంటేనే కన్నీళ్లు తెప్పించే ఉల్లి.. ఇప్పుడు కొంటుంటే ఘాటెక్కుతోంది. బహిరంగ మార్కెట్లలో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్లోనూ ఉల్లి ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సరిగ్గా దసరా పండుగకు ఇరవై రోజుల క్రితం సదాశివపేట పట్టణ వీధుల్లో వాహనాల్లో ఉల్లిగడ్డ తీసుకొచ్చి వందకు ఆరు, పదు కిలోల చొప్పున విక్రయించారు. రిటైల్‌గా రూ 20 కిలో చొప్పున అమ్మారు. దసరా పండుగకు ముందు అమాంతంగా ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు, హోటళ్లు, తినుబండారాలు, ఆహారాల దుకాణాల వారు ఉల్లిధర పెరగడంతో వాటి వినియోగాన్ని తగ్గించారు, సదాశివపేటకు వచ్చిన గ్రామీణులు ఉల్లిధర విని అమ్మో అంటున్నారు, మరో నెల రోజుల తర్వాత గాని ఉల్లిధరలు తగ్గుముఖం పట్టదని డీలర్లు పేర్కొంటున్నారు.
జూలై నుంచి అక్టోబర్ మధ్య ఉల్లి ధరలను పోల్చి చూస్తే ధరలో దాదాపు 50 శాతం పెరిగింది. జూలైలో రూ.20 ఉండగా అక్టోబర్, నవంబర్‌లో 50 నుంచి 80కి పెరిగింది. ఈ విధంగా చూస్తే ఉల్లి సగటు ధరలు 50 శాతం పెరిగాయి, మహారాష్ట్రంలోని హోల్‌సెల్ ఽమార్కెట్‌లో కూడా ఉల్లిధరలు భారీగా పెరగడంతో దాదాపు 30 శాతం మేర ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం.
సాగు విస్తీర్ణం తగ్గడంతోనే..
మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఉల్లి దిగుమతి అవుతుంటాయి. గత వానా కాలం సీజన్‌లో ఆయా రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఉల్లికి కొరత ఏర్పడి ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారాలు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2,596 ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. జిల్లాలోని నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి, కంది, మునిపల్లి, జహిరాబాద్ తదితర మండలాల్లో ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో అత్యదికంగా వెయ్యి ఎకరాల వరకు సాగు చేస్తున్నారు, సదాశివపేట మండలం అరూర్, నందికంది, పెద్దాపూర్‌తో పాటు కొండాపూర్ మండలం గొల్లపల్లి, మునిదేవునిపల్లి, మన్‌సాన్‌పల్లి, మల్లేపల్లి, అనంతసాగర్, మారేపల్లి, గంగారం, గ్రామాల్లో ఉల్లి సాగుచేస్తారు. సాధారణంగా ఉల్లిని అధిక భాగం దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాల్లో సాగవుతుంది, అయితే ఈ ఏడాది కర్నూలు జిల్లాలో రుతుపవనాలు అలస్యంగా రావడం, వచ్చిన అసమానంగా ఉండటం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పంటలు రాక ఆలస్యమవడంతో ఉల్లి లభ్యత తగ్గింది. దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఉల్లిధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కొరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment