
ఎన్నికల విధులు వివరిస్తున్న ఎస్పీ రూపేష్
● ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగిస్తే సహించం ● చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ● ఎస్పీ చెన్నూరి రూపేష్
ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికలు కీలకం
సంగారెడ్డి /పటాన్‌చెరు టౌన్: ప్రజాస్వామ్యదేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమని, ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఎస్పీ చెన్నూరి రూపేష్ హెచ్చరించారు. మంగళవారం ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో సార్వత్రిక ఎన్నికల విధులకు వచ్చిన సెంట్రల్ ఆర్మూడ్ ఫోర్స్, వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందికి విధుల గురించి వివరించారు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్లరాదన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా ఉండాలని, అనవసర విషయాలు చర్చించవద్దన్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే ఏ చిన్న సంఘటన ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఓటర్లు సెల్‌ఫోన్‌లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, పోలింగ్ బూత్ లోనికి తీసుకువెళ్లారాదని, సెల్ఫీలు దిగడం నిషేధమన్నారు. ప్రజలు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు, సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్, సబ్–డివిజన్ సీఐలు శ్రీధర్ రెడ్డి, చంద్రయ్య, సుధీర్ కుమార్, నాగరాజు, ఎస్‌ఐలు, వివిధ జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.