ఫలించిన మంత్రాంగం | - | Sakshi
Sakshi News home page

ఫలించిన మంత్రాంగం

Published Wed, Dec 6 2023 4:36 AM | Last Updated on Wed, Dec 6 2023 12:37 PM

- - Sakshi

● ఆ ఇద్దరినీ విజయానికి చేరువ చేసిన ట్రబుల్‌షూటర్‌ ● సంగారెడ్డి, జహీరాబాద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీశ్‌రావు ● రెండుచోట్ల సన్నిహితులకు కీలక బాధ్యతలు ● పకడ్బందీ వ్యూహాలను అమలుచేసిన మాజీ మంత్రి

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ రెండు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చారు. పకడ్బందీ వ్యూహాలను అమలు చేసి ఆ రెండు చోట్ల బీఆర్‌ఎస్‌ జెండా ఎగిరేలా చేయగలిగారు. హస్తం పార్టీ హవాలోనూ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ కంటే ఓ సీటు అధికంగా గెలుచుకోవడం ద్వారా పట్టు నిలుపుకునేలా చేయడంలో హరీశ్‌రావు సఫలీకృతుడయ్యారు. ఆయన ముఖ్యంగా సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాలను ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించినప్పటికీ, ఆ రెండు స్థానాల్లో మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులు ఒకరిద్దరు నాయకులకు కీలక ఎన్నికల బాధ్యతలు అప్పగించినా హరీశ్‌ వారితో తన వ్యూహాలను తు.చ తప్పకుండా అమలు చేయించారు. తద్వారా అక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులిద్దరినీ విజయం వైపు నడిపించారు.

సంగారెడ్డిలో పక్కా వ్యూహం

సంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి బరిలో ఉండగా, బీఆర్‌ఎస్‌ టిక్కెట్టును హరీశ్‌రావు పట్టుబట్టి చింతా ప్రభాకర్‌కు ఇప్పించుకున్నా రు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి రెండు నెలల ముందు నుంచే పక్కా ప్రణాళికను రూపొందించుకుని.. పోలింగ్‌ ముగిసిసే చివరి నిమిషం వరకు పకడ్బందీగా అమలు చేయించారు. ఆ టిక్కెట్టు ఆశించి భంగపడి అసమ్మతి రాగం వినిపించిన ముఖ్య నాయకులను, చింతా ప్రభాకర్‌తో అంతర్గత విభేదాలున్న కొందరు ద్వితీయ శ్రేణి నాయకులను హరీశ్‌రావు బుజ్జగించి సమన్వయం చేశా రు. తాను స్వయంగా అసమ్మతి నేతల ఇంటికి వెళ్లి అసమ్మతి నేతలను దారికి తెచ్చుకున్నారు. నామినేషన్‌ సమయానికి ఎక్కడా చిన్న అసంతృప్తులకు కూడా తావులేకుండా క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించారు. ప్రచార సరళిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వచ్చారు. అవసరం మేరకు వ్యూహాలను మా ర్చుతూ క్యాడర్‌ను ముందుకు నడిపించారు. బహి రంగసభలు, రోడ్‌షోలు, ఎన్నికల ప్రచారంపై ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ వచ్చారు. పోలింగ్‌ రెండు రోజులు ఉండగా సీఎం కేసీఆర్‌ బహిరంగసభను సంగారెడ్డిలో నిర్వహించేలా హరీశ్‌రావు కేసీఆర్‌ ప్రచార షెడ్యుల్‌ను ఖరారు చేయించారు. అక్క డ పోలింగ్‌కు రెండు రోజుల ముందు నిర్వహించే పోల్‌ మేనేజ్‌మెంట్‌ కూడా పకడ్బందీగా జరిగింది. ఇలా పోలింగ్‌కు రెండు నెలల ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా గులాబీ శ్రేణులను నడిపించిన హరీశ్‌ సంగారెడ్డిలో చింతా ప్రభాకర్‌ను విజయ తీరాలకు చేర్చగలిగారు.

కర్నాటక ప్రభావం ఉన్నా..

జహీరాబాద్‌ నియోజకవర్గాన్ని కూడా హరీశ్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గులాబీ పార్టీ అభ్యర్థి మాణిక్‌రావును గెలిపించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌కు అక్కడ కీలక బాధ్యతలను అప్పగించి ఆయన ద్వారా ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయించగలిగారు. జహీరాబాద్‌ కాంగ్రెస్‌ ఖాతాలో పడుతుందని మొదటి నుంచి అన్ని రాజకీయ వర్గా లు భావించాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలు, మైనార్టీలు అధికంగా ఉన్న ఈ స్థానంలో కాంగ్రెస్‌ సులభంగా గెలుస్తుందని అంచనా వేసుకున్నారు. సర్వేలు కూడా ఆ స్థానం కాంగ్రెస్‌దే అన్నట్టు వివరించాయి. అయినప్పటికీ క్యాడర్‌ ఏమాత్రం నిరాశ చెందనీయకుండా చివరి క్షణం వరకు పోరాటం చేసేలా చేయడంలో హరీశ్‌రావు సఫలీకృతుడయ్యా రు. పార్టీకి మేలు జరుగుతుందని తెలిస్తే బూత్‌ స్థాయి కార్యకర్తతో కూడా ఆయన స్వయంగాగానీ, ఫోన్లోగానీ మాట్లాడారు. మైనస్‌ ఉన్న మండలాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తమ వైపు తిప్పగలిగారు. ప్రభావం చూపే సామాజికవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ను ఆదరించేలా చేశారు. పలు మండలాల్లో విభేదాలతో ఉన్న నేతలను హైదరాబాద్‌కు పిలిపించుకుని వారిని సమన్వయం చేశారు. జహీరాబాద్‌లో హరీశ్‌రావు అన్నీ తానై ఎదురొడ్డి నిలబడి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాణిక్‌రావును ముందుకు నడిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement