హైదరాబాద్: అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ స్నేహితుల జీవితాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అందరూ కలిసి సూర్యోదయాన్ని (సన్‌రైజ్) చూడటానికి వెళ్లి సంతోషంతో తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదం తీరని దు:ఖాన్ని మిగిల్చింది. కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం ఎర్రగడ్డ తండాకు చెందిన బానోతు రామ్మోహన్, వినోద దంపతుల కుమారుడు బానోతు శ్రీరామ్(20) జోగిపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇండస్ట్రియల్ విజిట్ కోసం తోటి విద్యార్థులతో కలిసి నగరానికి వచ్చారు. గురువారం రాత్రి మణికొండలో ఉండే క్లాస్‌మేట్ దితేష్ ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం సన్‌రైజ్ (సూర్యోదయం) చూసేందుకు ఖాజాగూడ పెద్ద చెరువు వ్యూ పాయింట్ వద్దకు వెళ్లారు. కొద్దిసేపు ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు.
అనంతరం పెద్ద చెరువు నుంచి లింక్ రోడ్డు గుండా కారులో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ వైపు వస్తున్నారు. మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా చెట్టును, తర్వాత బండరాయిని ఢీకొట్టి అవతలి రోడ్డులో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీటులో ఉన్న బానోతు శ్రీరామ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవ్ చేస్తున్న చందానగర్‌లోని గంగారం నివాసి కె.ఉదయ్ సాయి(18), మణికొండకు చెందిన దితేష్(17), రామాయంపేటకు చెందిన వర్షిత్(18), నారాయణఖేడ్‌కు చెందిన వంశీ(18)కి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని కేర్‌ఆస్పత్రికి తరలించారు.
సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో..
పిల్లి అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేయగా.. కారు అదుపు తప్పిందని డ్రైవింగ్ చేసిన ఉదయ్ సాయి చెబుతున్నాడు. శ్రీరామ్ ఎగిరి కారు కింద పడ్డాడని, సీటు బెల్ట్ పెట్టుకుంటే పరిస్థితి మరోలా ఉండేదని పోలీసులు తెలిపారు. అతి వేగం, నిర్లక్ష్యంగా కారు నడపడంతోనే అదుపుతప్పినట్లు భావిస్తున్నారు. అవతలి వైపు రోడ్డులో కారు పల్టీ కొట్టినప్పుడు అటుగా వాహనదారులు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కొడుకు ఇక లేడని..
డ్రైవర్ ఉదయ్ సాయికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని శ్రీరామ్ కుటుంబ సభ్యులు చెబుతుండగా, లైసెన్స్ విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నాకు ఉంది 20 గుంటల భూమి, కూలి పనులు చేస్తూ రెక్కల కష్టంతో కూతురు హిమశ్రీ బీటెక్ చదివిస్తున్నానని, కొడుకు శ్రీరామ్‌ను పాలిటెక్నిక్ చదివిస్తున్నానని తండ్రి రామ్మోహన్ కన్నీరు మున్నీరు అయ్యారు. కొడుకు ఇక లేడని జీర్ణించుకోలేక గుండెలవిసేలా విలపించారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ మహేశ్, ఎస్‌ఐ విజయ్ కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment