
కొండపోచమ్మ ఆలయం
గజ్వేల్/జగదేవ్‌పూర్: జిల్లాలోని కొమురవెళ్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడు కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు మూడు నెలల పాటు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి జాతర ప్రారంభమై మార్చి 31వరకు కొనసాగనున్నది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ కనీస వసతుల కల్పనలో నిర్లక్ష్యం నెలకొనడం అందోళన కలిగిస్తోంది. జాతర సమయం ముంచుకొస్తుండగా, ఏర్పా ట్లు మాత్రం నామమాత్రంగా సాగుతున్నాయి.
ఉత్సవ కమిటీ ఏర్పడేనా?
ఐదేళ్లుగా కొండపోచమ్మకు రెగ్యులర్ పాలకవర్గం ఏర్పాటు చేయడం లేదు. జాతరకు ముందు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ మూడు నెలల పాటు పాలకవర్గం పనిచేసేలా తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ప్రభుత్వం మారడం, జాతర సమయం దగ్గరకు వస్తున్నప్పటికీ కమిటీని ఏర్పాటు చేస్తారా లేదా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్సవ కమిటీ ఏర్పాటుకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే జాతర ఏర్పాట్లపై ఆలయ ఈఓ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, తాగునీరు, ఇతర కనీస వసతుల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు.
యాక్షన్ ప్లాన్ ఏదీ?
అప్పటి సీఎం, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌ను 2019 మే నెలలో ప్రారంభించిన సందర్భంలో ఆలయం వద్ద నవచండీయాగం నిర్వహించి అమ్మవారిని దర్శించకున్నారు. ఆదే సమయంలో ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు. రూ.10కోట్లతో యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నామని అధికారులు, నేతలు ప్రకటన కూడా చేశారు. ఇదే క్రమంలో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పలుమార్లు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి కోసం స్తపతితో ఆలయ మ్యాప్ వేయించారు. కానీ కార్యాచరణకు అడుగు పడలేదు. అలాగే చెరువు సుందరీకరణకు నోచుకోలేదు.

సుందరీకరణకు నోచుకోని ఆలయ సమీపంలోని చెరువు

ఆలయం వద్ద మురికి కాల్వల దుస్థితి
Comments
Please login to add a commentAdd a comment