జహీరాబాద్ టౌన్: కార్మికుల పొట్టను కొడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారుల కొమ్ముకాస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. పట్టణ సమీపంలోని మహీంద్ర అండ్ మహీంద్ర కర్మాగారంలో శుక్రవారం నిర్వహించిన కార్మిక యూనియన్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేఏళ్ల నుంచి కార్మిక, రైతాంగ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని వాపోయారు. కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందన్నారు. కార్మిక చట్టాల రద్దును ఆపాలని, లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణికి నిరసనగా ఫిబ్రవరి 16న జరుగనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం, మహీంద్ర యూనియన్ ప్రధాన కార్య దర్శి రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రాపురం(పటాన్‌చెరు): మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద, కార్పొరేట్ విధానాలను నిరసించాలని, 16న దేశవ్యాప్తంగా సమ్మె, గ్రామీణ బంద్‌ను ప్రజలంతా విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం బీహెచ్‌ఈఎల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి రావడం కోసం అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమైన విషయం అని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కె.రాజయ్య, నాయకులు పెంటయ్య, బాషా, వీరన్‌రావు, ప్రభాకర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment