వట్‌పల్లి(అందోల్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. జోగిపేట ఎస్‌ఐ–2 మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామానికి చెందిన చెప్యాల గోపాల్(38) అప్పులు చేసి ట్రాక్టర్, వరికోత మిషన్ యంత్రాలతోపాటు ఓ కారును కొనుగోలు చేశాడు. అప్పుల భారం రోజు రోజుకూ పెరగడంతో కొంత భూమిని అమ్మినా తీరలేదు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం ఉద యం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం నాందేడ్ అకోలా 161 జాతీయ రహదారి పక్కన ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకున్నట్లు కనిపించాడు. గోపాల్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి భార్య మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో..
పటాన్‌చెరుటౌన్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కథనం ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కళింగగూడెంకు చెందిన పూజారి రామకృష్ణ(35) బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు వచ్చాడు. డీఎన్ కాలనీలో ఉంటూ పాశమైలారం పారిశ్రామిక వాడలోని యూజియా ఫార్మా క్యాంటీన్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నా డు. ఆర్థిక ఇబ్బందులతోపాటు మద్యానికి బానిసైన రామకృష్ణ ఇంటికి వెళ్లకుండా, పని చేసే క్యాంటీన్ వద్దే ఉంటున్నాడు. సోమవారం ఉదయం క్యాంటీన్ స్టోర్ రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గోపాల్(ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment