పటాన్‌చెరు టౌన్: నిర్మాణ దశలో ఉన్న భవనం ఐదో అంతస్తుపై నిలబడి ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన గణేష్ బతుకుదెరువు కోసం భార్యతో కలిసి హైదరాబాద్ కాచిగూడకు వచ్చి పెయింటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల నుంచి రామచంద్రాపురం పరిధిలోని వెలమెల గార్డియన్ స్కూల్ డి– బ్లాక్ వద్ద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పని చేసే చోట ఐదో అంతస్తుపై నుంచి ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఉసురుతీసిన ఆర్థిక ఇబ్బందులు
రామాయంపేట (మెదక్): ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని తొనిగండ్ల గ్రామానికి చెందిన మైసంగల సిద్దరాములు (50) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. ఈ విషయమై కుమారుడితో గొడవ పడిన సిద్ధరాములు.. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మండలంలోని దామరచెరువు గ్రామశివారులో క్రిమి సంహారక మందు తాగాడు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశాడు. వారు ఘటనా స్థలికి చేరుకొని సిద్దరాములును కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు.
గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి
వెల్దుర్తి(తూప్రాన్): ఓ ఆటోడ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి లక్ష్మణ్(42) 20 ఏళ్లకు పైగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఆటోల్లో ప్రయాణికులు చాలా తక్కువగా రావడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటుతో ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలాడు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రెండో పెళ్లి చేసుకున్నాడని..
తూప్రాన్: రెండో పెళ్లి చేసుకున్న భర్తపై మొదటి భార్య ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ శివానంద్ కథనం ప్రకారం.. హవేళి ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన షబానా 2019లో తూప్రాన్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్‌తో వివాహం జరిగింది. వీరికి కూతురు ఉంది. పెళ్లయిన మూడు నెలల నుంచే అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టించినా ఇమ్రాన్ కుటుంబంలో మార్పు రాలేదన్నారు. దీంతో 2022లో హవేళి ఘనపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్య షబాన ఫిర్యాదు చేసింది. కామారెడ్డి కోర్టులో విడాకులు, మెయింటెనెన్స్ కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ లింగారెడ్డిపేటకు చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడని మొదటి భార్య షబాన ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment