కమ్మనైనది.. అమ్మ భాష
● మాతృభాషను మించినమరొక భాష లేదు ● కాపాడుకుంటేనే మనుగడ ● అభివృద్ధికి కృషి చేస్తున్నకవులు, రచయితలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మాతృభాషను మించి మరొక భాష లేదని చాలా మంది కవులు చెబుతుంటారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎన్నో పెరిగాయి. చాలా మంది విదేశాలకు వెళ్లడానికి తపనపడుతున్నారు. అందుకు ఇంగ్లిషు నేర్పుకోవడం తప్పనిసరి అవుతుంది. దీంతో విద్యార్థులు తెలుగు భాషపై పట్టు కోల్పోతున్నారు. తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కవులు, కళాకారులు చెబుతున్నారు. మనం సమాజంలో ఎదిగేందుకు తల్లి ఎంత కృషి చేస్తుందో, అదే విధంగా మాతృభాష కూడా మన ఆహా భావాలు సరైన రీతిలో వ్యక్తపర్చటానికి తల్లిలా దోహదపడుతుంది. మాతృభాష తెలుగును జిల్లాలోని తెలుగు భాషా పండితులు, అదేవిధంగా కవులు అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మన భాష, యాసను కాపాడటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసించాలని, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయాలని తహతహలాడుతు, మన మాతృభాష రాకున్న ఫర్వాలేదు కాని ఇంగ్లిష్ రావాలనే తపనలో ఉన్నారు. దీంతో నేడు విద్యనభ్యసిస్తున్న అనేక మంది విద్యార్థులకు అటు ఇంగ్లిష్, ఇటు తెలుగు సక్రమంగా రాయడం, చదవడం రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ మాతృభాషను విస్మరించడమే తప్పు.
తెలుగు భాషాభివృద్ధికి కృషి
జిల్లాలోని అనేక మంది తెలుగు భాష పండితులు తాము వృత్తిరీత్య పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధిస్తూనే తీరిక సమయంలో కవితలు, రచనలు రాస్తూ పుస్తకాల రూపంలో వెలువరించటం ద్వారా జిల్లాలో సాహితీ అభిమానులు తమ పిల్లలకు మాతృభాషపై పట్టు సాధించేలా దృష్టి సారిస్తున్నారు. సాయంత్రం సమయాల్లో ఉపాధ్యాయులు, కవులందరూ కలిసి కవి సమ్మేళనాలు, అష్టవధానాలు, తదితర ప్రక్రియలతో తెలుగు భాషాభివృద్ధికి తోడ్పాటునందించే విధంగా కార్యాచరణ అమలుపరుస్తున్నారు. జిల్లాలోని అనేక మంది ఉపాధ్యాయులు తెలుగు భాషలో బోధన చేస్తూ గుర్తింపు పొందారు. ఇందులో ముఖ్యంగా నాడు నందిని సిధారెడ్డి నుంచి మొదలుకొని నేటి వరకు అనేక మంది పాత, కొత్త తరం కవులు, రచయితలు జిల్లాలో తెలుగుభాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
మాతృభాషను విస్మరించొద్దు
మనలో ఉన్న భావాలను స్వేచ్ఛగా అందించేది మన మాతృభాష. అలాంటి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరు ప్రఖ్యాతి గాంచిన తెలుగు అజరామరం. బాలలైన వృద్ధులైన నేడు సిద్దిపేట సాహితీ లోకంలో విహరిస్తూ మాతృభాష కృషికి బాటలు వేస్తున్నారు. ఇద ఆహ్వానించదగిన విషయం. మాతృభాష అభివృద్ధి చెందాలంటే మన పిల్లలకు తెలుగు నేర్పడంలో మనం చొరవ తీసుకోవాలి. ఇతర భాషలను గౌరవిస్తూనే, మన మాతృభాషను విస్మరించొద్దు. ఇప్పటికి జిల్లాలో మాతృభాష అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– ఉండ్రాళ్ల రాజేశం, బాలసాహితీవేత్త, సిద్దిపేట
మానవ సంబంధాలను ముడి వేస్తుంది
మాతృభాష చక్కని మాధుర్యానికి, పలుకుబడులకు, నుడికారాలకు పుట్టినిల్లు. మాతృభాష మమకారం మానవ సంబంధాలను ముడివేస్తుంది. నేడు అనేక మంది తమ కుటుంబాల్లో ఇతర భాషల్లో మాట్లాడుతున్నారు. దీంతో చిన్నారులకు ఇటు తెలుగు, ఇతర భాషలు పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోతున్నారు. కేవలం మాతృభాష దినోత్సవం నాడే కాకుండా ప్రతి రోజూ మన మాతృభాష అభివృద్ధికి ముందుకు సాగాలి. మన మాతృభాషను కాపాడుకోవటం అందరి బాధ్యత. ఇతర భాషలు నేర్చుకున్నప్పటికీ మన భాషను విస్మరించద్దు.
–భామండ్ల రాజు, తెలుగు అధ్యాపకులు, సిద్దిపేట
నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment