సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సదాశివపేట శివారులోని ఓ ప్రైవేటు టైర్ల పరిశ్రమ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. తమను క్రమబద్ధీకరించాలంటూ ఆందోళనకు దిగిన 338మందికి పైగా కార్మికులపై వేటు వేసింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం యాజమాన్యం శిక్షణ పేరుతో నిరుద్యోగ యువతను ఉద్యోగాల్లోకి తీసుకుంది. అప్పట్నుంచి వీరిని పర్మినెంట్ చేయకుండా ట్రైనీగానే పనిచేయించుకుంటూ నెలకు రూ.14వేలు మాత్రమే చెల్లిస్తోంది. ఇన్నాళ్లు తక్కువ వేతనమిచ్చినా సర్దుకుపోయామని, తమను పర్మినెంట్ చేయాలంటూ ఆందోళనకు దిగడంతో సదరు పరిశ్రమ ఒక్కసారిగా వీరందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో ఆ కార్మిక కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ శాఖ డీఆర్‌డీఏ (జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ) అప్పట్లో నిర్వహించిన జాబ్‌మేళాలో ఈ ఉద్యోగాలు పొందారు. నిబంధనల ప్రకారం ఒకటి రెండేళ్లకు మించి ట్రైనీగా కొనసాగించరాదు. నాలుగేళ్లుగా అరకొర వేతనాలతో ట్రైనీగా కొనసాగిస్తూ తమను శ్రమ దోపిడీకి గురి చేస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
22న మరోసారి చర్చలు!
ఉద్యోగాలు పోయిన సుమారు 338 మంది కార్మికులు వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికశాఖ అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేశారు. ఆ శాఖ అధికారులు ఇప్పటికే పలుమార్లు యాజమాన్యంతో చర్చలు జరపగా, కంపెనీ ప్రతినిధులు ఇంకా ఎటూ తేల్చడం లేదు. ఈ నెల 22న మరోసారి చర్చించాలని నిర్ణయించారు.
సదాశివపేటలోని ఓ ప్రైవేటు టైర్ల పరిశ్రమ సంచలన నిర్ణయం
ఆందోళనకు దిగిన కార్మికులను తొలగించిన యాజమాన్యం
చర్చలు జరుపుతున్నాం: డిప్యూటీ కమిషనర్
మరోసారిచర్చలు జరుపుతాం
సుమారు 338 మందికిపైగా ట్రైనీలను ఉద్యోగాల్లోంచి తొలగించడంతో సంబంధిత కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 22న మరోసారి చర్చలు జరుపుతాం. ట్రైనీగా ఎన్ని రోజులు కొనసాగించాలనే దానిపై నిర్ణీత నిబంధనలేవీ లేవు. చర్చలు ఫలించకపోతే లేబర్ కోర్టుకు రిఫర్ చేస్తాం.
–శ్రీనివాస్‌రెడ్డి, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment