మంటగలుస్తున్న మానవత్వం
ఆందోళన కలిగిస్తున్న హత్యలు
● ఆస్తి, వివాహేతర సంబంధాలతో కుటుంబ సభ్యులపైనే దాడులు
సిద్దిపేటకమాన్: మానవత్వం మంటగలుస్తోంది. బంధాలు.. బంధుత్వాలను మరిచి క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. ఆధునిక జీవన శైలి, ఆస్తి, భూ తగాదాలు, వివాహేతర సంబంధాలే హత్యలకు దారితీస్తున్నాయి. కుటుంబ సభ్యులను.. కట్టుకున్న భార్యను.. భర్తను, చివరకు సొంత అన్నదమ్ములను సైతం మట్టుబెడుతున్నారు. చిన్న చిన్న తగాదాలు, కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో నా అనుకున్న వాళ్లనే హత్య చేయడం ఆందోళన కలిగిస్తోంది. బీమా డబ్బులు వస్తాయని, భూములు, ఆస్తులు దక్కించుకోవాలని, తదితర కారణాలతో మద్యం మత్తులో, క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో రెండు హాత్యలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో పలు రకాల కారణాలతో 2024లో (గతేడాది) 25 హత్య కేసులు, 2023లో 13 హత్య కేసులు నమోదైనట్లు పోలీసు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయి.
భూతగాదాలు,
వివాహేతర సంబంధాలే కారణం
మారుతున్న జీవనశైలి, ఆస్తి, భూతగాదాలు, వివాహేతర సంబంధాలు, మరోవైపు రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు అధికంగా పెరగడం వల్ల కుటుంబ సభ్యులను, సొంత అన్నదమ్ములను సైతం హత్య చేయడానికి వెనుకాడడం లేదు. మానవత్వాన్ని, రక్త బంధాన్ని మరిచి హత్యలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాల వల్ల.. అడ్డు తొలంగించుకోవాలనే ఉద్దేశ్యంతో కట్టుకున్న వారినే మట్టుబెడుతున్నారు. ఇన్సురెన్స్ (బీమా) డబ్బులు వస్తాయనే దురుద్దేశంతో మనిషి విలువైన ప్రాణాలను సైతం తీస్తున్నారు.
సిద్దిపేట గుండ్ల చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న బోదాసు శ్రీను గురువారం గుర్తుతెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ శ్రీను హత్యకు దారితీసినట్లు సమాచారం. ఆవేశమే శ్రీనుని బలితీసుకుంది. ఘటనపై మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అత్యాశ..
ఆకునూరు గ్రామానికి చెందిన దొండకాయల కనకయ్యకు ఇద్దరు తమ్ముళ్లు, అక్క ఉన్నారు. వీరు తల్లిని సరిగా చూడడం లేదని అక్క యాదవ్వ తనతో ఉంచుకుని బాగోగులు చూస్తోంది. ఈ క్రమంలో తల్లి పేరుపై ఉన్న 3.03 ఎకరాల భూమిని సోదరులకు తెలియకుండా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయంలో అన్నదమ్ములు, అక్క మధ్య గొడవలు జరగాయి. కనకయ్య తరుచూ గొడవ పెట్టుకుంటుండటంతో అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న యాదవ్వ, ఆమె కుమారుడు కృష్ణమూర్తి కలిసి కనకయ్యను హత్య చేశారు. ఆత్మహత్యలా చిత్రీకరించేలా ప్రయత్నం చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడటంతో నిందితులను ఈ నెల 9న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వివాహేతర సంబంధంతో..
మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ యువకుడు ఆమె భర్తపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. సిద్దిపేట పట్టణంలో భార్య, పిల్లలతో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 21ఏళ్ల యువకుడు శ్రవణ్ సదరు మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రియుడు శ్రవణ్‌తో కలిసి భర్తను చంపడానికి భార్య పతకం వేసింది. అందులో భాగంగా గత నెలలో రెండు సార్లు భర్తను చంపడానికి యత్నించారు. ఘటనపై బాధితుడు సిద్దిపేట టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈనెల 18న నిందితుడు శ్రవణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆవేశం..
జిల్లాలో హత్య కేసులు
సంవత్సరం.. సంఖ్య
2023 13
2024 25
2025లో ఇప్పటి వరకు 02
మనుషులపై ప్రేమ ఏదీ?
డబ్బుపై ఉన్న ప్రేమ మనిషిపై లేకపోవడం వల్లనే హత్యలు జరుగుతున్నాయి. మనిషి తన అవసరాలకు మించి హుందాతనం, హంగు, ఆర్భాటం గొప్పతనానికి పోయి అనవసర ఖర్చులతో ఆర్థిక వలయంలో చిక్కుకుంటున్నారు. కారణం ఏదైనా సరే విలువైన మనిషి ప్రాణం తీయడం సరికాదు. మనిషి తనను తాను మోసం చేసుకుంటూ తనుకు ఏం కావాలో తెలియక ఉన్మాద స్థితికి వెళ్లి దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విలువైన ప్రాణాలను తీయకూడదు.
– డాక్టర్ శాంతి, సైకియాట్రిక్ విభాగ ం
హెచ్‌ఓడీ, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్
మంటగలుస్తున్న మానవత్వం
Comments
Please login to add a commentAdd a comment