అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
సంగారెడ్డి జోన్: కొన్నేళ్లుగా పల్లాడియం కార్బన్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను జిల్లా పోలీసులు అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన వివరాలను జిల్లా ఎస్పీ రూపేశ్ గురువారం మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పరిధిలోని మసీద్‌పురం గ్రామానికి చెందిన అల్లం సాంబశివుడు హైదరాబాద్‌లోని సూరారంలో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలో పుణెలోనూ, సంగారెడ్డిజిల్లాలోనూ పలు ఫార్మా కంపెనీల్లో పనిచేయడం వల్ల అతడికి బహిరంగ మార్కెట్‌లో భారీగా ధర పలికే పల్లాడియం కార్బన్ గురించి అవగాహన ఉంది. పల్లాడియం కార్బన్‌ను అమ్ముకుని భారీగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో చోరీ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందుకు పుణె ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన ప్రసాద్‌తో పాటు ఆదిత్య అంకుష్ మన్నె, ముక్కంటి రెడ్డి, మట్టాకుటుంబరావు, గుమ్మడి శ్రీనివాస్‌రావుతో కలసి ఓ ముఠాను తయారు చేశాడు. అందరూ కలసి ఫార్మా కంపెనీల్లో నిల్వ ఉంచే పల్లాడియం కార్బన్‌ను దొంగిలించేవారు.
హెచ్ ఆర్ మేనేజర్ ఫిర్యాదుతో..
ఈ నెల 8న సదాశివపేట పరిధిలోని యావాపూర్ గ్రామ శివారులోని అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్–3 కంపెనీలో పల్లాడియం కార్బన్ దొంగతనం జరిగింది. దీనిపై ఆ సంస్థ సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్ మజ్జి సూరప్పల నాయుడు సదాశివపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగి న పోలీసులు సాంకేతిక సమాచారం, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి బుధవారం మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నిందితుల్ని పట్టుకున్నారు. వారి నుంచి 96 కిలోల పల్లాడియం కార్బన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాంబశివుడు ముఠా గతంలో జిల్లాలోని బొంతపల్లి, బీదర్ ఫార్మా కంపెనీలలో కూడా మొత్తంగా 120 కేజీల పల్లాడియం కార్బన్‌ను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.4.50కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులను గురువారం జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు త్వరితగతిన ఛేదించిన సదాశివపేట ఇన్‌స్పెక్టర్ మహేశ్‌గౌడ్, సీసీఎస్, ఇన్‌స్పెక్టర్ శివకుమార్, కొండాపూర్ ఇన్‌స్పెక్టర్ డి.వెంకటేశ్, పి.రామునాయుడు ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ శ్రీకాంత్, కొండాపూర్ ఎస్సై హరిశంకర్ గౌడ్ సిబ్బందిని అభినందించారు.
వివిధ ఫార్మా కంపెనీల నుంచిపల్లాడియం కార్బన్ చోరీ
వివరాలు వెల్లడించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment