యువకుడి దారుణ హత్య
● సిద్దిపేట పట్టణంలో ఘటన ● పరిశీలించిన ఏసీపీ మధు, సీఐ ఉపేందర్
సిద్దిపేటకమాన్: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వ్యక్తి హత్యకు గురైన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణం డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న బోదాసు శ్రీను (29)కు సంధ్యతో 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం భార్య సంధ్య పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటుండగా శ్రీను సిద్దిపేటలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో ఉంటున్నాడు. పట్టణంలోని నర్సాపూర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఇంటిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనుపై దాడి చేసి హత్య చేశారు. గురువారం తెల్లవారుజామున ఇంటి యజమాని మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట ఏసీపీ మధు, సీఐ ఉపేందర్ మృతదేహాన్ని పరిశీలించి, చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సిబ్బంది వేలి ముద్రలు సేకరించారు. మృతుడికి నేర చరిత్ర ఉందని, అతడిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీను తలపై రక్తపు గాయాలు ఉండడంతోపాటు ఘటనా స్థలంలో కర్రను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment